Sridevi: శ్రీదేవి మన మధ్య లేకపోయినా ఆమె నటించిన సినిమాలు, చేసిన పాత్రలు ఇంకా ప్రేక్షకుల మనసులో అలా ఉండిపోయాయి. ఏ హీరోతో నటించినా కూడా తన కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యేవారు. అలా తను కలిసి నటించిన ఎంతోమంది హీరోల్లో చిరంజీవి కూడా ఒకరు. చిరంజీవి, శ్రీదేవి పెయిర్‌కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని ఇప్పటికీ ప్రశంసిస్తూనే ఉంటారు. అలాంటి శ్రీదేవి.. చిరంజీవితో నటించే అవకాశం వచ్చినా కూడా వదులుకుందట. కేవలం టైటిల్ విషయంలో అడ్జస్ట్ అవ్వలేక శ్రీదేవి సినిమా నుండే తప్పుకుందనే విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదు. ఇంతకీ అదేం సినిమానో తెలుసా.?
పవర్‌ఫుల్ పాత్ర
కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి పలు సినిమాల్లో నటించారు. అందులో ఒకటి ‘కొండవీటి దొంగ’. ఈ మూవీకి పరుచూరి బ్రదర్స్ రైటర్స్‌గా పనిచేశారు. అయితే ఈ సినిమాలో హీరోకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. హీరోయిన్ పాత్రకు కూడా అంతే సమానంగా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే అలాంటి పవర్‌ఫుల్ రోల్‌లో శ్రీదేవి అయితే బాగుంటుందని, తనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని మేకర్స్ అనుకున్నారట. ‘కొండవీటి దొంగ’లో పోలీస్ పాత్రలో కనిపించడం కోసం శ్రీదేవిని అప్రోచ్ అయ్యారట. అంతా బాగానే ఉంది, చర్చలు ముగిశాయి. శ్రీదేవికి స్టోరీతో పాటు పాత్ర కూడా నచ్చింది. కానీ ఒక్కటే సమస్య.. తనకు టైటిల్ నచ్చలేదు.
టైటిల్ మార్చాలి
‘కొండవీటి దొంగ’లో హీరోకు సమానంగా హీరోయిన్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి టైటిల్‌ను అనుగుణంగా మార్చమని కోరారట శ్రీదేవి (Sridevi). తన పాత్రలో ఉన్న ప్రాముఖ్యత ప్రేక్షకులను తెలిసే విధంగా టైటిల్‌ను ‘కొండవీటి రాణి’గా మార్చమని అడిగారట. కానీ అప్పటికే చిరంజీవి (Chiranjeevi) కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు సాధించారు. ఆయన సినిమాలను ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. అలాంటి సమయంలో చిరంజీవి పాత్రకు తగినట్టుగా కాకుండా హీరోయిన్ పాత్రకు తగినట్టుగా టైటిల్ పెట్టడం కరెక్ట్ కాదని ‘కొండవీటి దొంగ’ అనే టైటిల్‌నే ఖరారు చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అలా శ్రీదేవి సీన్ నుండి తప్పుకొని విజయశాంతి ఎంటర్ అయ్యారు.
Also Read: తమిళంలో జాన్వీ కపూర్ లాంచ్‌కు సర్వం సిద్ధం.. రంగంలోకి కాంట్రవర్షియల్ డైరెక్టర్..
విజయశాంతికి ఛాన్స్
అప్పటివరకు విజయశాంతి పలు కమర్షియల్ సినిమాల్లో నటించినా.. ‘కొండవీటి దొంగ’ (Kondaveeti Donga) మాత్రం తన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇందులో చిరంజీవి, విజయశాంతి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా ఈ సినిమా పాటలను ఇంకా వినే ఆడియన్స్ ఉన్నారు. ‘కొండవీటి దొంగ’తో చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించలేకపోయారు. కానీ ఆ తర్వాత కొంతకాలానికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా వచ్చింది. అది వారిద్దరికీ మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే సినిమా అయిపోయింది. ఇప్పటికీ శ్రీదేవిని అతిలోక సుందరి అనే పిలుచుకుంటూ ఉంటారు తన ఫ్యాన్స్. ఆ రేంజ్‌లో తన పాత్రలు ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి.