Redin Kingsley:ప్రముఖ కమెడియన్ , నటుడు రెడిన్ కింగ్స్లీ (Redin Kingsley) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జైలర్ (Jailer) సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. ప్రముఖ సీరియల్ నటి సంగీత (Sangeetha) ను 47 సంవత్సరాల వయసులో వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. 2023 డిసెంబర్ 10న బెంగళూరులో లేటు వయసులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గర బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికే గర్భవతి అయిన సంగీత.. తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం తెల్లవారుజామున చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో సంగీత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అటు తల్లి ఇటు బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారు. ఇక ప్రస్తుతం సంగీతం తల్లి అయిందని తెలిసి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగీత.. పోస్ట్ వైరల్..
ఇకపోతే రెడిన్ కింగ్స్లీ , నటి సంగీత దంపతులకు కూతురు పుట్టడంతో వారి కుటుంబంలో సంతోషం రెట్టింపు అయింది. ఈ క్రమంలోనే సంగీత ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. “మా లిటిల్ ప్రిన్సెస్ ను మీరందరూ ఆశీర్వదించండి..మా జీవితంలో అద్భుతమైన ఒక కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి సమయంలోనే మీరందరూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ఈ శుభవార్తతో మా ఫ్యామిలీ మరింత ఫుల్ ఫిల్ అయింది. ఇంతకు మించిన మధురమైన క్షణాలు ఇక ఏవీ లేవు అని అనుకుంటున్నాను” అంటూ సంగీత తెలిపింది .మొత్తానికైతే సంగీత, రెడిన్ కింగ్స్లీ తల్లిదండ్రులు అయ్యారని తెలిసి పలువురు సెలబ్రిటీలు , అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రెడిన్ కింగ్స్లీ కెరియర్..
రెడిన్ కింగ్స్లీ విషయానికి వస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాతో ఈయన భారీ పాపులారిటీ అందుకున్నారు. అటు డాక్టర్ మూవీలో కూడా భగత్ పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటితోపాటు మట్టి కుస్తీ, మార్క్ ఆంటోనీ, బీస్ట్ చిత్రాలు చేసిన ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు.
సంగీత కెరియర్..
ఇక నటి సంగీత విషయానికి వస్తే.. ఈమె పలు చిత్రాలలో, సీరియల్స్ లో నటించింది. ఇకపోతే ఈమెకు ఇది రెండో వివాహం కావడం గమనార్హం. గతంలో కృష్ణ ను వివాహం చేసుకున్న ఈమెకు ఒక పాప కూడా జన్మించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సంగీత కమెడియన్ తో ప్రేమలో పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకునే సమయం లో భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ వయసులో పెళ్లి అవసరమా అంటూ ఎంతోమంది విమర్శించారు కూడా .. అయితే సంగీత.. మానసికంగా నా వయసు 18.. ఆయన వయసు 22.. మేమిద్దరం ఆ ఏజ్ లోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం.. అంటూ కూడా చెప్పింది.అయినా సరే రూమర్లు ఆగలేదు.. డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటుందని కామెంట్లు చేశారు. ఏది ఏమైన ఇప్పుడు సంగీత ఒక బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.