Renu Desai : రేణు దేశాయ్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ (OG) మూవీ గురించి ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ మీటింగ్లో పాల్గొన్న రేణు దేశాయ్ ‘ఓజీ’ మూవీతో పాటు పిల్లల గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి ‘ఓజీ’ గురించి ఆమె ఏం మాట్లాడిందంటే…
జనవరి 3న సావిత్రిబాయి పూలే 194వ జయంతి. ఈ సందర్భంగా విజయవాడలో ‘భారత చైతన్య యువజన పార్టీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో రేణూ దేశాయ్ (Renu Desai) స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు. అయితే తనకు నచ్చని రెండే రెండు విషయాలు ఒకటి రాజకీయాలకు దూరంగా ఉండడం. రెండోది అవార్డు ఫంక్షన్స్ కు అని ఆన్నారామె. “రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటానో అందరికీ తెలుసు. మరి ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యాను అంటే… సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం, ఉపాధ్యాయుల కోసం ఈవెంట్ అని చెప్పడంతో వెంటనే ఓకే చెప్పాను.
మీకు తెలుసు గత మూడు రోజులుగా నేను కాశీలోనే ఉన్నాను. అయితే కచ్చితంగా ఈవెంట్ కి వస్తానని చెప్పాను. ఇక పిల్లలు తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులతోనే ఎక్కువగా టైం కేటాయిస్తారు. అలాంటి వాళ్ళను సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత టీచర్స్ పైనే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.
అయితే ఈ కార్యక్రమంలో మరో గెస్ట్ గా హాజరయ్యారు దిగ్గజ నటుడు బ్రహ్మానందం (Brahmanandam). ఒకే వేదికపై బ్రహ్మానందంను చూడడం సంతోషంగా ఉందంటూ రేణు దేశాయ్ ఎగ్జైట్ అయింది. ఆయనను చూస్తుంటే వణుకు వచ్చేస్తోందని చెప్పింది. అదే విషయాన్ని తెలియజేస్తూ రేణు దేశాయ్ బ్రహ్మానందంను ‘ఓజీ’ (OG) అని సంబోధించింది. ‘ఓజి’ అంటే ఏంటి అని ఆయన అడగ్గా, ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ అంటూ నవ్వేసింది. “మిమ్మల్ని చూశాక ఇలా అనక తప్పట్లేదు. నిజంగా ఈ వేదికపై మిమ్మల్ని చూడడానికి ఎంత సంతోషంగా ఉందో నేను చెప్పలేను” అంటూ బ్రహ్మానందంతో స్టేజిని షేర్ చేసుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేసింది. అయితే రేణూ దేశాయ్ ఇలా పవన్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా టైటిల్ ను తన నోటితో చెప్పడంతో తెగ ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, రేణు దేశాయ్ (Renu Desai) తో పాటు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ తదితరులు పాల్గొన్నారు. ఈవెంట్ చివర్లో రేణు దేశాయ్ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చారు.
ఇదిలా ఉండగా గత రెండు మూడు రోజుల నుంచి రేణూ దేశాయ్ తన పిల్లలతో కలిసి కాశీలో పర్యటించిన సంగతి తెలిసిందే. అఖిరా నందన్ అక్కడ సింపుల్ గా ఆటోలో ప్రయాణిస్తున్న వీడియోలు కూడా వీఆరాల అయ్యాయి.