Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). మరో 10 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ‘పుష్ప’ మేనియా తగ్గి, ‘గేమ్ ఛేంజర్’ హడావుడి కనిపిస్తోంది. అయితే నిన్న మొన్నటిదాకా ఈ మూవీ రిలీజ్ కి పట్టుమని 15 రోజులు కూడా లేదు, ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు అంటూ మెగా అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన రామ్ చరణ్ కటౌట్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు (Dil Raju) జనవరి 1న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నామని అప్డేట్ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పారు. కానీ అంతలోనే సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ డేట్ మారబోతుందని బ్యాడ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
రీసెంట్ గా విజయవాడలో రామ్ చరణ్ (Ram Charan) భారీ కటౌట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్రపంచంలోనే అత్యంత భారీ కటౌట్ గా రామ్ చరణ్ ఫాన్స్ ఈ కటౌట్ తో రికార్డును క్రియేట్ చేశారు. అయితే ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి హైప్ పెంచడానికి అభిమానులు మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మూవీ టీం మాత్రం ప్రమోషన్స్ పరంగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ గురించి మెగా ఫాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కటౌట్ లాంచ్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ మూవీ నిర్మాత దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ట్రైలర్ ని జనవరి 1న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ ట్రైలర్ ని సింపుల్ గా రిలీజ్ చేయకుండా హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో ఓ భారీ ఈవెంట్ ద్వారా విడుదల చేయాలని ప్లాన్ చేశారని, ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేస్తారని ప్రచారం నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ట్రైలర్ రిలీజ్ ను జనవరి 1న కాకుండా 2వ తేదీన ప్లాన్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ నడుస్తోంది. ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ ఇంకా పూర్తి కాలేదట. ప్రేక్షకులకు ఈ ట్రైలర్ తో మంచి కిక్ ఇచ్చే ఆలోచనలో ఉన్న మేకర్స్, ఒకరోజు ఆలస్యంగా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు. కానీ అభిమానులు మాత్రం సినిమాకి హైప్ పెంచడం సంగతి పక్కన పెడితే, ఉన్న హైప్ ని చెడగొట్టేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.