AP Govt: ఏపీలో కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వం ఓ పథకాన్ని జనవరి ఒకటో తేదీన అమలు చేయబోతోంది. ఈ పథకం మొదలైతే ఎందరో విద్యార్థులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత పాఠశాలల్లో అమలవుతున్న పథకాన్ని, తాజాగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం, పెద్ద పండుగ పేరుతో పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ దశలో విద్యార్థుల హాజరు శాతాన్ని గమనించిన మంత్రి నారా లోకేష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో చర్చించిన అనంతరం నారా లోకేష్ సంబంధిత అధికారులతో సైతం సమావేశమయ్యారు.
పదవ తరగతి విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను కొనసాగించడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల స్థాయి వరకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ కళాశాలలో సైతం అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించడంతో, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వరం లాంటిదని, ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం అమలు చేయడం అభినందనీయమంటూ విద్యార్థి సంఘాలు సైతం తెలుపుతున్నాయి. అయితే నూతన సంవత్సరం కానుకగా రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలలో జనవరి ఒకటో తేదీన ఈ పథకానికి ప్రభుత్వం స్వీకారం చుట్టనుంది. పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 115 కోట్లు మంజూరు చేయగా, రేపటినుండి రాష్ట్రవ్యాప్తంగా పథకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.