Rewind 2024 : 2024 ఏడాది చాలామంది సెలబ్రిటీల జీవితాల్లో సంతోషాన్ని నింపింది. ముఖ్యంగా నితిన్, శర్వానంద్, అమలా పాల్ లాంటి ప్రముఖులు పేరెంట్స్ గా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది చాలా మంది సెలబ్రిటీలు తల్లిదండ్రులు అయ్యారు. మరి 2024 లో తల్లిదండ్రులైన సెలబ్రిటీలు ఎవరో చూసేద్దాం పదండి.
చిత్రా శుక్లా (Chitra Shukla)
తెలుగులో తెల్లవారితే గురువారం, మస్తు షేడ్స్ ఉన్నయ్ రా, కలియుగ పట్టణం , సిల్లీ ఫెలో, రంగుల రాట్నం, హంట్, పక్కా కమర్షియల్, ఉనికి వంటి ఎన్నో సినిమాల్లో నటించిన హీరోయిన్ చిత్ర శుక్లా సెప్టెంబర్ 30న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
నితిన్ (Nithiin)
టాలీవుడ్ హీరో నితిన్ ఈ ఏడాది ద్వితీయార్థంలో తండ్రి అయ్యారు. సెప్టెంబర్ 6న ఆయన ఇంట్లో వారసుడు అడుగు పెట్టాడు. ఆయన భార్య షాలిని పండంటి మగబ్డికు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 2020 జూలై 16న నితిన్, షాలిని వివాహం జరిగింది. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.
శర్వానంద్ (Sharwanand)
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ ఏడాది తండ్రిగా ప్రమోషన్ పొందారు. మార్చి 6న ఆయన భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అదీగాక తన పుట్టిన రోజునే పాప పుట్టిందంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాపకు లీలా దేవి అని పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు.
అమలా పాల్ (Amala Paul)
ప్రముఖ నటి అమలా పాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 11న వారసుడు పుట్టాడని, ఇళై (ILAI) అని పేరు పెట్టామని తెలిపారు అమలా పాల్ దంపతులు. పర్యాటక, ఆతిథ్య రంగాల నిపుణుడు జగత్ దేశాయ్ (Jagat Desai)తో ఆమె వివాహం గతేడాది వైభవంగా జరిగింది.
మానస్ (Manas)
బిగ్ బాస్ మాజీ కంటెస్టెట్, బ్రహ్మముడి సీరియల్ నటుడు మానస్ నాగుల పల్లి ఈ ఏడాది తన అభిమానులకు తండ్రిని అయ్యాను అంటూ శుభవార్త చెప్పాడు. సెప్టెంబర్ 10న ఆయన తన భార్య సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే తాను తండ్రినయ్యానన్న గుడ్ న్యూస్ చెప్పాడు. తన సతీమణి శ్రీజ నిశ్వంకర పండంటి మగ బిడ్డను ప్రసవించినట్లు ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టాడు.
టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు బాలీవుడ్ పవర్‌ప్యాక్ కపుల్ దీపికా పదుకొనే – రణ్‌వీర్ సింగ్ సెప్టెంబర్ 8న తల్లిదండ్రులు అయ్యారు. ఈ జంట తమ పాపకు దువా అని పేరు పెట్టారు. అలాగే వరుణ్ ధావన్ – నటాషా దలాల్ వారసుడిని, యామీ గౌతమ్-ఆదిత్య ధర్ మే 20న తమ కుమారుడు వేదవిద్ కు స్వాగతం పలికారు. రిచా చద్దా – అలీ ఫజల్, విక్రాంత్ మాస్సే – శీతల్ ఠాకూర్, అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ దంపతులు కూడా ఈ ఏడాది తల్లిదండ్రులయిన సెలబ్రిటీల లిస్ట్ లో ఉన్నారు.