Bollywood:ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఇమేజ్ సొంతం చేసుకున్న వారిని.. కొంతమంది దుండగులు టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రత్యేకించి బడా స్టార్స్ ను టార్గెట్ చేస్తూ.. డబ్బులు ఇవ్వాలని కొంతమంది వారిని బెదిరిస్తుంటే, మరి కొంతమంది ఏకంగా దొంగతనానికి పాల్పడుతూ లక్షల రూపాయలను దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతమ్ చక్రవర్తి (Pritam Chakraborty) కార్యాలయంలో కూడా దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మ్యూజిక్ డైరెక్టర్ కార్యాలయంలో దొంగతనం..
అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు సౌండ్ ట్రాక్లను కంపోజ్ చేయడంలో పేరుపొందిన ప్రీతమ్ చక్రవర్తికి ముంబైలో ఉన్న ఆఫీసులో.. ఇటీవల దొంగతనం జరిగినట్లు సమాచారం. దాదాపుగా రూ. 40 లక్షల నగదు దొంగలించబడినట్లు సమాచారం. ఈ దొంగతనంతో సంగీత దర్శకుడికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ దొంగతనానికి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. అటు ఈ విషయంపై ప్రీతం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆయన నివేదికను తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారట. ఇకపోతే ఈ విషయంపై ప్రీతం స్వయంగా మీడియాతో వెల్లడించకపోయినా…ఆయన టీం లోని ఒక ప్రముఖ సభ్యుడు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నట్లు సమాచారం. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఆఫీస్ లో దొంగతనం జరిగిందని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎవరో కావాలని చేశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై పూర్తి నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ఆరోజు ఆఫీసులో ఏం జరిగిందంటే..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రీతమ్ మేనేజర్ వినీత్ ఛేడా ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి రూ.40 లక్షలు ట్రాలీ బ్యాగ్ లో తీసుకొచ్చి, ఆఫీసులో ఉంచారు. ఇదే సమయంలో వినీత్ ఛేడా తో పాటూ ఆశిష్ సాయల్, అహ్మద్ ఖాన్ అనే ఇద్దరు ఉద్యోగులు ఆఫీస్ లోనే ఉన్నారు. అయితే పని నిమిత్తమై వినీత్ అదే బిల్డింగ్ లో ఉన్న ప్రీతమ్ చక్రవర్తి ఇంటికి వెళ్లాడు.. కానీ తిరిగి వచ్చేసరికి డబ్బు ఉన్న ట్రాలీ బ్యాగ్ కనిపించలేదు. దీంతో అప్రమత్తమైన వినీత్..డబ్బు సంచి ఉన్న బ్యాగ్ గురించి సిబ్బందిని అడగగా.. ఆశీష్ సాయల్ ప్రీతం చక్రవర్తి ఇంట్లో ఇవ్వడానికి తీసుకు వెళ్తున్నట్లు చెప్పారని తెలిపారట. దీంతో అనుమానం కలిగిన వినీత్.. వెంటనే ఆశిష్ కి ఫోన్ చేయగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే ప్రీతమ్ కి తెలియజేయగా.. దగ్గర్లోని పోలీసులకు ఫిర్యాదు చేశారట. దీంతో పోలీసులు ఆశీష్ కోసం గాలిస్తున్నారు. అయితే తాజాగా అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. అంతేకాదు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని కూడా పోలీసులు వెల్లడించారు.
ప్రీతమ్ చక్రవర్తి కెరియర్..
ప్రీతమ్ చక్రవర్తి బాలీవుడ్లో దాదాపు 70కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) అమీర్ ఖాన్ (Ameer Khan), రణబీర్ కపూర్ (Ranbir Kapoor) , సల్మాన్ ఖాన్(Salman Khan) వంటి దిగ్గజ స్టార్ హీరోలతో పనిచేశారు. చివరిగా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాకి కేవలం మ్యూజిక్ మాత్రం అందించారు.