Sai Pallavi.. లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి (Sai Pallavi) తాజాగా నాగ చైతన్య (Naga Chaitanya) తో మరోసారి జతకట్టింది. అలా వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా రాబోతున్న చిత్రం ‘తండేల్’. ప్రముఖ దర్శకుడు చందు మొండేటి (Chandu mondeti) దర్శకత్వం వహిస్తూ ఉండగా.. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగు శరవేగంగా జరుగుతోంది. ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో సినిమాపై వరుస అప్డేట్స్ వదులుతూ హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే.. ఈరోజు జనవరి 28వ తేదీన ట్రైలర్ ను వైజాగ్ లో లాంచ్ చేయబోతున్నారు. కానీ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సాయి పల్లవి వస్తుందా ? రాదా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయి పల్లవి..
అసలు విషయంలోకి వెళ్తే.. గత పది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందట సాయి పల్లవి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. ఈ మేరకు తాజాగా సాయి పల్లవి తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెబుతున్న వీడియోని మేకర్స్ రిలీజ్ చేయగా.. అందులో ఆమె ఈ సమస్యలతో బాధపడుతున్నట్లు మనం చూడవచ్చు. ఈ వీడియోలో సాయి పల్లవి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూనే డబ్బింగ్ కూడా చెబుతూ ఉండగా.. డైరెక్టర్ చందు మొండేటి ఆమెను ఆటపట్టిస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక దీన్ని బట్టి చూస్తే జ్వరం కారణంగా ఈరోజు వైజాగ్ లో జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఈమె హాజరు కాకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సాయి పల్లవి అనారోగ్య సమస్యలు తండేల్ మూవీకి తలనొప్పిగా మారాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సాయి పల్లవి త్వరగా కోలుకోవాలని, అందుకు తగిన విశ్రాంతి తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు ఫ్యాన్స్..
సాయి పల్లవి కెరియర్..
సాయి పల్లవి విషయానికి వస్తే.. తెలుగులో తొలిసారి ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కేవలం సెలెక్టివ్ గానే సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈమె చివరిగా తమిళంలో ‘అమరన్’ సినిమా చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక అమరన్ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో ఆయన భార్య పాత్రలో ఇందు రెబెక్కా వర్గీస్ గా ఒదిగిపోయి మరీ నటించింది సాయి పల్లవి. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా సాయి పల్లవికి ఫుల్ క్రేజ్ వచ్చేసిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో కూడా ఒక సినిమా చేస్తోంది.బాలీవుడ్ లో రణబీర్ కపూర్(Ranbir Kapoor) రాముడిగా నటిస్తున్న రామాయణం(Ramayan) సినిమాలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ.