Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) దాడి ఘటన కారణంగా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. పోలీసులు ఇప్పటికే నిందితుడిని పట్టుకున్నారు. ఇక సైఫ్ కూడా కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పటౌడీ ఫ్యామిలీకి షాకింగ్ వార్త అందింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న పటౌడీ కుటుంబానికి చెందిన రూ. 15,000 కోట్ల ఆస్తి “ఫ్లాగ్ హౌస్”ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందనేది ఆ వార్త.
15000 కోట్ల ఆస్తి ప్రభుత్వం ఆధీనంలోకి…
నిజానికి రాజధాని భోపాల్‌లో సైఫ్ (Saif Ali Khan) కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉంది. దీనికి సంబంధించిన అనేక ఆస్తి తగాదాలు కోర్టులో నడుస్తున్నాయి. అయితే భోపాల్‌లోని పటౌడీ కుటుంబానికి చెందిన రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తి ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి రావచ్చు. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఈ ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది.
ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అంటే ?
1968లో ఈ చట్టాన్ని రూపొందించారు. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం విభజన తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లిన వ్యక్తులు భారతదేశంలో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది.
వివాదం ఇదే
నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆస్తికి చట్టబద్ధమైన వారసురాలు ఆయన పెద్ద కూతురు అబిదా. కానీ ఆమె 2015లో పాకిస్థాన్‌కు వెళ్లిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఈ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కిందకు వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. అయితే నవాబ్ రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ వారసులు (సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్ వంటివారు) ఈ ఆస్తిపై తమకు హక్కు ఉందని దావా వేశారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కోహెఫిజాలో ఉన్న అహ్మదాబాద్ ప్యాలెస్ సమీపంలోని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందినది. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తర్వాత సైఫ్‌కి భోపాల్ నవాబ్ బిరుదు లభించింది. తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిగింది. ఇప్పుడు పటౌడీ కుటుంబానికి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన వారసుడు.
సైఫ్ ఫ్యామిలీ ముందున్న ఏకైక మార్గం
భోపాల్‌లోని చారిత్రక రాచరిక రాష్ట్రాల ఆస్తులపై 2015 నుండి నిషేధం ఉంది. 2015 నుంచి భోపాల్ రాష్ట్రంలోని చారిత్రక ఆస్తులపై ఉన్న స్టేను ఇప్పుడు కోర్టు ఎత్తేసింది. ఈ స్టే ఎత్తేయడం కారణంగా సైఫ్ ఆస్తి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కేసులో అప్పీలేట్ అథారిటీ ముందు తమ వాదనను వినిపించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ అలీ ఖాన్, అతని తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా, సబా అలీ ఖాన్, పటౌడీ సోదరి సబీహా సుల్తాన్‌లను ఆదేశించింది.
అయితే పటౌడీ కుటుంబ సభ్యులు 30 రోజుల్లోగా అప్పీలు అధికారి ముందు హాజరుపరచాలని జస్టిస్ వివేక్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ బెంచ్ కొన్ని రోజుల క్రితం ఆదేశించింది. కానీ నిర్ణీత గడువులోగా పటౌడీ కుటుంబం తమ వాదనను వినిపించలేదు. కోర్టు ఇచ్చిన టైమ్ ఇప్పటికే పూర్తి కాగా, పటౌడీ ఫ్యామిలీ దీనిపై ఎటువంటి దావా వేయలేదు. ఇప్పుడు తమ వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఉండడానికి డివిజన్ బెంచ్‌లో ఈ ఉత్తర్వులను సవాలు చేయడమే పటౌడీ కుటుంబానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం.