Vizag News: ఏపీలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయట. అన్నీ పెద్ద తలకాయల జాబితా సుమారుగా ఉందట. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు, బడా బాబుల భరతం పట్టేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అందులో పొలిటికల్, నాన్ పొలిటికల్ బిగ్ బాస్ లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై విశాఖ సీపీ డాక్టర్ శంకబ్రత బాబ్జి సంచలన కామెంట్స్ చేశారు.
క్రికెట్ బెట్టింగ్ గురించి తెలియని యువత ఉండరు. తక్కువ కాలవ్యవధిలో అధిక ఆదాయం పొందాలన్న ఆశతో యువకులు బెట్టింగ్ బాట పడుతున్నారు. అంతేకాదు జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా, కొందరు యువత మాత్రం మా దారి.. మాయ దారి అంటూ బెట్టింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి బెట్టింగ్ బ్యాచ్ భరతం పట్టారు వైజాగ్ పోలీసులు.
క్రికెట్ బెట్టింగ్ విశాఖపట్టణంలో జోరుగా సాగుతుందని సమాచారం అందుకున్న సీపీ డాక్టర్ శంకబ్రత బాబ్జి దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో పోలీసులు బెట్టింగ్ ముఠా ఆటకట్టించారు. బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్ పై సీపీ మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగ్ ముఠాలోని ఏడుగురు సభ్యులను ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. కొన్ని విషయాలను పబ్లిక్ గా చెప్పలేమని, ముఠాలో పెద్ద తలకాయలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని, అందరినీ కచ్చితంగా పట్టుకుంటాన్నారు. క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఓ హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ఎంక్వయిరీ కి ఆదేశించినట్లు సీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన ఏడుగురు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారని, అంతా దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన ముఠా సభ్యులతో పాటు వాళ్లకి సంబంధాలు ఉన్నవాళ్లు బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశామని సీపీ తెలిపారు.
Also Read: Case On Rahul Gandhi: రాహుల్ వల్లే నా పాల క్యాన్ పడిపోయింది, కోర్టుకెక్కిన బీహార్ వ్యక్తి!
రానున్న ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ ముఠాలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు, బెట్టింగ్ ఆడితే బెల్టు తీయడం ఖాయమంటూ సీపీ హెచ్చరించారు. విశాఖ సిటీ ప్రజలే తమ ఇన్ఫార్మర్స్ అంటూ పేర్కొన్న సీపీ, తన ఫోన్ నెంబరు అందరి వద్ద ఉందని ఇలాంటి సమాచారం తెలియజేయాలని సీపీ సూచించారు. ప్రజలు ఇచ్చిన సమాచారంతోనే క్రికెట్ బెట్టింగ్ ముఠాలో సభ్యులను అరెస్ట్ చేయగలిగామన్నారు. ఇంతకు ఈ ముఠాలో ఉన్న ఆ పెద్ద తలకాయలు ఎవరన్నదే ఇప్పుడు సంచలనంగా మారింది.