Salman Khan House Firing Case: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి చాలాకాలం అయ్యింది. అయినా ఇప్పటికీ ఈ కేసులో పలు ట్విస్టులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్ హౌజ్ ఫైరింగ్ కేసులో ప్రముఖ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితుల కుటుంబ సభ్యులు మహారాష్ట్ర, బిహార్ ప్రభుత్వాలకు లేఖలు రాశారు. దావూద్ ఇబ్రహీం నుండి నిందితులకు అపాయం ఉందని, అందుకే తమకు రక్షణ కల్పించాలని వారు ఆ లేఖల్లో పేర్కొన్నారు. అంటే సల్మాన్‌కు దావూద్ సపోర్ట్ ఇచ్చాడనే విషయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏం జరిగిందంటే
గుజరాత్ నుండి వచ్చిన విక్కీ గుప్తా, సాగర్ పాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఏప్రిల్ 14న ముంబాయ్‌లోని సల్మాన్ ఖాన్ నివాసం అయిన గ్యాలక్సీ అపార్ట్‌మెంట్ బయట కాల్పులు జరిపారు. వారు కాల్పులు జరిపిన కాసేపటిలోనే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అప్పుడే వారు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు అనే విషయం బయటపడింది. దీంతో అప్పటినుండి కొన్నాళ్ల పాటు ఈ కేసు గురించి బాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడిచింది. అసలు వారిద్దరూ గుజరాత్ నుండి ముంబాయ్‌కు ఎలా వచ్చారు, కాల్పులు జరపడానికి ఎలా ప్లాన్ చేశారు, కాల్పులు జరిపిన తర్వాత ఏం చేద్దామనుకున్నారు వంటి వివరాలను పోలీసులు సేకరించారు. తాజాగా దావూద్ నుండి విక్కీ, సాగర్ కుటుంబాలకు అపాయం ఉందనే విషయం బయటపడింది.
Also Read: నాపై ఏడాదిగా అత్యాచారం, ‘అక్కడ’ అలా చేస్తూ పైశాచిక ఆనందం: దర్శకుడిపై నటి సౌమ్య షాకింగ్ కామెంట్స్
అదే దుస్థితి
బిహార్‌లోని వెస్ట్ చంపరాన్ జిల్లాలోని మఝారియాకు చెందిన విక్కీ గుప్తా సోదరుడు సోనూ గుప్తాతో పాటు అదే ఏరియాలో ఉండే సాగర్ పాల్ సోదరుడు రాహుల్ పాల్ కూడా మహారాష్ట్ర, బిహార్ ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ప్రస్తుతం విక్కీ, సాగర్.. ఇద్దరూ తలోజా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వారి సోదరులు వచ్చి వారిని కలిసినప్పుడు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుండి అపాయం ఉందని, తన మనుషులు వారిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారని చర్చలు జరిగాయి. ఒకవేళ అదే నిజమయితే విక్కీ, సాగర్‌తో పాటు అరెస్ట్ అయ్యి లాకప్‌లోనే మరణించిన అనుజ్ తపన్ దుస్థితి తమకు కూడా వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సల్మాన్‌తో సంబంధాలు
విక్కీ గుప్తా లాయర్ కూడా ఇదే విషయంపై మీడియాతో మాట్లాడారు. ‘‘విక్కీ గుప్తా, సాగర్ పాల్ కలిసి తమకు రక్షణ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. దావూద్‌కు చెందిన డీ కంపెనీ నుండి వారికి అపాయం ఉందని అన్నారు. వారిద్దరూ తమ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలిపారు. సల్మాన్ ఖాన్‌కు దావూద్‌తో సంబంధాలు ఉన్నాయని, అందుకే తమను దావూద్ గ్యాంగ్ ద్వారా చంపించాలని చూస్తున్నారని వారిద్దరి ఆరోపణ. వారి రక్షణ గురించి సెంట్రల్ గవర్నమెంట్‌తో పాటు మహారాష్ట్ర, బిహార్ ప్రభుత్వాలకు కూడా లేఖలు రాశాం’’ అని ఆయన వివరించారు. మొత్తానికి ఈ కేసులో దావూద్ జోక్యం నిజమయితే ఇదొక మంచి థ్రిల్లర్ సినిమా అవుతుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.