KCR: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కష్టాలు మొదలయ్యాయా? అవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై ఇప్పటికే జ్యుడీషియల్ విచారణ జరుగుతుండగా, తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రాజెక్టు అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ అయ్యారు. వ్యక్తిగతంగా కేసీఆర్ హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
నోటీసుల వ్యవహారం వెనుక అసలేం జరిగింది. అన్న డీటేల్స్ లోకి ఒక్కసారి వెళ్దాం.. మేడిగడ్డ ప్రాజెక్టులో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యిందంటూ సామాజిక కార్యకర్త రాజ లింగమూర్తి భూపాలపల్లి న్యాయస్థానంలో జనవరి 12న పిటీషన్ దాఖలు చేశారు.
ALSO READ: హైదరాబాద్.. భూమిలో నుంచి పొగలు.. ప్రజలు షాక్..
కేసీఆర్ సహా 8 మంది పేర్లు ప్రస్తావించారు. వారిలో మాజీ మంత్రి హరీష్ రావు, మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ సురేష్‌కుమార్, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ఈ పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం డైరెక్షన్‌తో మళ్లీ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సామాజిక కార్యకర్త.
గతనెలలో ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. సెప్టెంబరు ఐదున హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. గురువారం నాడు ఈ వ్యవహారం భూపాలపల్లి న్యాయస్థానం ముందుకొచ్చింది. మాజీ సీఎం కేసీఆర్, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు నోటీసులు అందలేదని వారి తరపు న్యాయవాదులు న్యాయ స్థానానికి తెలిపారు.
మిగతా ఆరుగురు తరపు న్యాయవాదులు హాజరయ్యారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును అక్టోబరు 17 నాటికి వాయిదా వేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుపై జ్యుడిషీయల్ ఎంక్వైరీ నడుస్తోంది.
మరోవైపు న్యాయస్థానం నోటీసులతో ఏం చేయ్యాలన్న దానిపై కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. వచ్చేనెల న్యాయస్థానం ముందు హాజరుకాకుంటే పరిణామాలేంటి? అన్నదానిపై అడ్వకేట్లతో మంతనాలు జరుపుతున్నారు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌కు కష్టాలు తప్పవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజ్‌పై తేనెతుట్టు కదులుతోందన్నమాట.