Allu Arjun : సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొక స్టార్ చేతికి వెళ్లిపోవడం అన్నది కామన్. కొన్నిసార్లు డేట్స్ కుదరకనో, మరికొన్నిసార్లు వాళ్ళ అంచనాలు తప్పు కావడం వల్లనో, లేదంటే కథ నచ్చక రిజెక్ట్ చేయడం వల్లనో హీరోలు కొన్ని బ్లాక్ బస్టర్ కథలను చేజార్చుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు కూడా మనం ఇలాంటి ఓ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదికూడా అల్లు అర్జున్ వదులుకున్న సినిమా. ఇక ఈ 900 కోట్ల సినిమా అన్నది సినిమా బడ్జెట్ గురించి కాదు కలెక్షన్ల గురించి. మరి 900 కోట్ల భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన ఏ సినిమాను అల్లు అర్జున్ (Allu Arjun) చేజార్చుకున్నాడు ? ఆ అదృష్టం ఏ స్టార్ హీరోని వరించింది ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2) ఇండియన్ రికార్డులు అన్నిటిని బ్రేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు అల్లు అర్జున్ వివాదంపై నమోదైన కేసులో కోర్టులో చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఆ ఎఫెక్ట్ సినిమాపై ఏమాత్రం పడట్లేదు. ఇప్పటికీ ‘పుష్ప 2’ మేనియా దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. కానీ చాలా కాలం క్రితమే ఇలాంటి పూనకాలు తెప్పించే సినిమాని వదులుకున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమా మరేదో కాదు ‘భజరంగీ భాయీజాన్’.
2015లో రిలీజ్ అయిన ‘భజరంగీ భాయీజాన్’ (Bajrangi Bhaijaan) సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సల్మాన్ హనుమంతుని భక్తుడిగా నటించాడు, అలాగే ఓ చిన్న పాప ప్రాణాలను కాపాడే మంచి వ్యక్తిగా కనిపించాడు. ఆ పాప పాకిస్తాన్ కు చెందినది అని తెలిసినప్పటికీ, ఆమెను తన సొంత ఇంటికి చేర్చడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, బాధ్యతగా నడుచుకుంటాడు హీరో. అయితే ఈ స్టోరీ సల్మాన్ కంటే ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిందట. కానీ అప్పట్లో తన బిజీ షెడ్యూల్ కారణంగా అల్లు అర్జున్ ఈ మూవీని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఆ తర్వాత అమీర్ ఖాన్ కు ఈ ప్రాజెక్ట్ ఆఫర్ రాగా, ఆయన ఏకంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు సూచించారట. కానీ దానికి డైరెక్టర్ కబీర్ ఖాన్ ఒప్పుకోకపోవడంతో అమీర్ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టారట. చివరికి ఈ మూవీ సల్మాన్ ఖాన్ దగ్గరకు వచ్చి చేరింది. ఇక మిగిలిన ఈ మూవీ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అప్పట్లోనే 90 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ‘భజరంగీ భాయీజాన్’ (Bajrangi Bhaijaan) మూవీ ఇండియాలోనే 320 కోట్లు కొల్లగొట్టింది. 2015లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 922 కోట్లు రాబట్టి, అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలలో ఒకటిగా చరిత్రను సృష్టించింది. పైగా సల్మాన్ ఖాన్ కెరీర్ లో కీలకమైన మైలురాయిగా మిగిలింది ఈ సినిమా.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ 2025 ఈద్ కానుకగా రిలీజ్ కాబోతోంది. మరోవైపు అల్లు అర్జున్ ఇంకా సంధ్య థియేటర్ వివాదంతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.