Sampoornesh babu:ప్రముఖ హీరో సంపూర్ణేష్ బాబు (Sampoornesh babu) ‘ హృదయ కాలేయం’ సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.. ఇకపోతే ఈ సినిమా విడుదలై 11 సంవత్సరాలైన సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. తన కెరియర్ ను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రెస్ మీట్ లో భాగంగా పలు విషయాలపై స్పందించిన సంపూర్ణేష్ బాబు.. తన గతాన్ని గుర్తుచేసుకొని కాస్త ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తన జీవితంలో ఒకరికి మాత్రం రుణపడి ఉంటాను అని.. ఎక్కడో కూలీ పని చేసి బ్రతికే తనకు ఈ స్థాయి కల్పించింది ఆయనే అంటూ కూడా తెలిపారు. మరి అసలు ఆయన ఎవరు? అసలేం జరిగింది ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను – సంపూర్ణేష్ బాబు..
ప్రెస్ మీట్ లో భాగంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ..” నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను.. బంగారు ఆభరణాలు తయారు చేసుకునే నాకు సినిమాపై అమితమైన ఇష్టం ఉండేది. అలాంటి నాతో ‘హృదయ కాలేయం’ తీసి నాకంటూ ఒక గుర్తింపును అందించారు డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh). ఈ సినిమా తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. నా పేరు కూడా మారిపోయింది. ఆటోల్లో తిరిగే నేను ఒక్కసారిగా విమానాలు ఎక్కాను. ఈ 11 సంవత్సరాల ప్రయాణంలో అన్నీ కూడా అద్భుతాలే జరిగాయి. ముఖ్యంగా నాకు ఇంతటి గుర్తింపును ఇచ్చిన సాయి రాజేష్ కి మాత్రం జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మా ప్రయత్నానికి మొదట సపోర్ట్ చేసిన వ్యక్తి ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఆయనకు ఇంకోసారి ధన్యవాదాలు చెబుతున్నాను. ఒక్క పోస్టుతో రాజమౌళి మా జీవితాలనే మార్చేశారు. ఈ ఇద్దరి వ్యక్తులను నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను” అంటూ సంపూర్ణేష్ బాబు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.. “భవిష్యత్తులో మళ్లీ సాయి రాజేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాను.కాకపోతే హృదయ కాలేయం సీక్వెల్ అయితే కాదు” అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు సంపూర్ణేష్ బాబు.
Bollywood: హీరో – హీరోయిన్ల మధ్య ఏజ్ కాదు.. అది ఉండాలి.. సల్లు – రష్మిక పై స్పందించిన హీరోయిన్
బిగ్ బాస్.. అది నా దురదృష్టం..
ఇక బిగ్ బాస్ నుంచి మధ్యలోనే బయటకి రావడం పై కూడా స్పందించారు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. “బిగ్ బాస్ గురించి నాకు పెద్దగా తెలియదు అయితే సడన్గా ఒక గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి వెళ్లాను. కాకపోతే అక్కడ జీవితం చాలా రిచ్ గా అనిపించింది. అలా జీవించడం నావల్ల కాలేదు. ఒక్కసారిగా ఏడ్చేశాను. ఆ సమయంలో నాకు హోస్ట్ గా ఉన్న ఎన్టీఆర్(NTR ) ఎంతో సపోర్ట్ చేశారు. అయినా సరే నేను మధ్యలోనే వచ్చేయడం దురదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే షో నుంచి బయటకు వచ్చాక చాలామంది నాపై సీరియస్ అయిపోయారు. అప్పుడు ఎంతో బాధపడ్డాను”. అంటూ సంపూర్ణేష్ బాబు తెలిపారు.. ఇకపోతే ప్రస్తుతం ‘సోదర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఏది ఏమైనా సంపూర్ణేష్ బాబు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కష్టపడితేనే సక్సెస్ చూస్తాము అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.