Sandhya Theatre Stampede : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) హైకోర్టు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు సోమవారం విచారణకు హాజరు కావాలంటూ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే మంగళవారం ఉదయం 11 గంటలకు పిఎస్ కు రావాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు. పోలీసుల నోటీసులకు స్పందించిన బన్నీ ఈరోజు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ వైపు అల్లు అర్జున్ (Allu Arjun) విచారిస్తుండగా, మరోవైపు ఆయనను థియేటర్ దగ్గరికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆంటోనీ అనే వ్యక్తిని చిక్కడ పల్లి పోలీసులు నిన్న అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన అల్లు అర్జున్ బౌన్సర్ కాగా, తొక్కిసలాటకు ప్రధాన కారణం అని భావిస్తున్నారు.
ఆంటోని విషయానికి వస్తే… సిటీలో ఎక్కడ ఈవెంట్ జరిగినా సరే ఈ ఆంటోని బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పని చేస్తారని సమాచారం. ఇక ఇప్పటికే అతన్ని అరస్ట్ చేసిన పోలీసులు, ఇప్పుడు సీన్ రీ కనస్ట్రక్షన్ కోసం అతన్ని సంధ్య థియేటర్ దగ్గరకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ముందుగా అల్లు అర్జున్ ను తీసుకెళ్ళి సంధ్య థియేటర్ దగ్గర సీన్ రీకనస్ట్రక్షన్ చేస్తారని వార్తలు విన్పించాయి. ఇప్పుడు మాత్రం ఆంటోని మధ్యలోకి రావడం ట్విస్ట్. మొత్తానికి ఈ కేసు ఎటు తిరిగి ఎటు వెళ్తుందో అర్థం కాకుండా ఉంది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ (Allu Arjun)ని ఇప్పటికే పోలీసులు రెండున్నర గంటల పాటు విచారించారు. సెంట్రల్ జోన్ డిసిపి అల్లు అర్జున్ ను అడ్వకేట్ అశోక్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రాజు నాయక్, ఏసిపి రమేష్ సమక్షంలో విచారించారు. విచారణలో భాగంగా ఆయన అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు, ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు టాక్ నడుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం అల్లు అర్జున్ సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయారని తెలుస్తోంది.
మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తర్వాత ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠభరితంగా మారింది. మరి అల్లు అర్జున్ నుంచి పోలీసు అధికారులు ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు? సీన్ రీ కన్స్ట్రక్షన్ తర్వాత ఏం జరగబోతోంది ? అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికైతే విచారణ పూర్తి కావడంతో అల్లు అర్జున్ తన ఇంటికి చేరుకున్నారు.