Director B Unnikrishnan : ప్రముఖ మలయాళ దర్శకుడు బి ఉన్నికృష్ణన్ (Director B Unnikrishnan) తనను అవమానించారని, బెదిరించారని లేడీ ప్రొడ్యూసర్, నటి సాండ్రా థామస్ (Sandra Thomas) ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేసి షాక్ ఇచ్చారు. డైరెక్టర్ ఉన్నికృష్ణన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనను బెదిరించారని, అతను చేసిన పనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ థామస్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
పగతో పని లేకుండా చేశాడు…
సినీ దర్శకుడు బి. ఉన్నికృష్ణన్ (Director B Unnikrishnan), నిర్మాత ఆంటో జోసెఫ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పబ్లిక్‌గా అవమానించారంటూ లేడీ నిర్మాత సాండ్రా థామస్ (Sandra Thomas) చేసిన ఫిర్యాదు మేరకు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను సినిమాల నుంచి కావాలని పగతో పక్కకు తప్పించారని సాండ్రా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. హేమ కమిటీకి స్టేట్మెంట్ ఇచ్చినందుకే తనపై కోపంతో ఇలాంటి పని చేశారని సాండ్రా స్పష్టం చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు ఉన్నికృష్ణన్, రెండో నిందితుడిగా ఆంటో జోసెఫ్ లని చేర్చినట్టు తెలుస్తోంది.
డైరెక్టర్ బి. ఉన్నికృష్ణన్ (Director B Unnikrishnan) మలయాళ సినిమా సాంకేతిక నిపుణుల సంఘం ఫెఫ్కా ప్రధాన కార్యదర్శి. అలాగే ఆంటో జోసెఫ్ కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు. వీరిద్దరూ కలిసి తనకు సహకరించవద్దని, కలిసి పని చేయకూడదు అని చిత్ర పరిశ్రమలోని చాలా మందిని కోరారని ఫిర్యాదులో సాండ్రా పేర్కొంది. మలయాళ సినిమాలో తనను ఒక్క సినిమా కూడా నిర్మించనివ్వబోమని బెదిరించారని ఆమె ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సాండ్రా థామస్ కేసును నమోదు చేసినట్లు కేరళ పోలీసులు కూడా అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
‘అమ్మ’కు రాజీనామా
మలయాళ చిత్ర పరిశ్రమలో అమ్మాయిలపై లైంగిక వేధింపులకు సంబంధించి హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నట్టు అన్పిస్తోంది తాజాగా సాండ్రా ఇచ్చిన కంప్లయింట్ చూస్తుంటే.
ఇక హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించగా, లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలోనే ‘మార్కో’ మూవీలో హీరోగా నటించిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ట్రెజరర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వర్క్ కమిట్మెంట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వెల్లడించారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలను బయట పెడుతూ జస్టిస్ కె హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత ‘అమ్మ’ అసోసియేషన్ వివాదంలో చిక్కుకుంది. ఆగస్ట్ 2024లో ఈ నివేదిక ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి రాగా, ఈ వివాదం మోహన్‌లాల్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల అమ్మా ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజీనామాకు దారి తీసింది. హేమ కమిటీ మలయాళ ఇండస్ట్రీలో అమ్మాయిలకు సమాన అవకాశాలు రావట్లేదని, వాళ్ళను లైంగికంగా వేధిస్తున్నారనే విషయాలను బయట పెట్టడం అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.