
Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమించింది. ఆయనకు హైదరాబాద్ టాప్ హాస్పిటల్స్‌లో ఒకటైన ఏఐజీ హాస్పిటల్ వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. రెండు రోజుల ముందు శరత్ బాబు అనారోగ్యంతో ఈ హాస్పిటల్లో చేరారు. శనివారం సాధారణంగానే ఉన్న ఆరోగ్యం ఆదివారానికి విషమించింది. ఆయన శరీరం ఇన్‌ఫెక్షన్‌కి గురైంది. దీని కారణంగా ప్రధాన అవయవాలైన కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు పాడైనట్లు డాక్టర్స్ తెలిపారు.
కొన్ని గంటలు గడిస్తే కానీ పరిస్థితి గురించి మాట్లాడలేమని చెప్పిన వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామని తెలిపారు. అభిమానులు శరత్ బాబు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కొన్నాళ్ల ముందు చెన్నైలో ఇలాగే అనారోగ్యానికి గురై ట్రీట్మెంట్ తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు మరోసారి శరత్ బాబు ఆరోగ్యం విషమంగా మారింది.
శరత్ బాబు 1951 జూలై 31న ఆముదాల వలసలో జన్మించారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. తండ్రి తన వ్యాపారాన్ని చూసుకోవాలని శరత్ బాబుని కోరారు. అయితే శరత్ బాబుకి నటుడు కావాలనే కోరిక లేదు. పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నారు. అయితే కంటి చూపు సమస్య కారణంగా ఆయన పోలీస్ ఆఫీసర్ కాలేకపోయారు. తర్వాత ఆయన సినీ రంగంలోకి అడుగు పెట్టారు.
1973లో విడుదలైన రామరాజ్యం ఈయన నటించిన తొలి చిత్రం. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు కన్నడ, మలయాళ , హిందీ చిత్రాల్లోనూ నటుడిగా రాణించారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. 220 చిత్రాలకు పైగా నటించి మెప్పించిన శరత్ బాబు మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులను కూడా అందుకున్నారు.
సినీ నటి రమా ప్రభను 1974లో వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల తర్వాత 1988లో వీరిద్దరూ విడిపోయారు. తర్వాత రెండేళ్లకు అంటే 1990లో స్నేహా నంబియార్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో 2011లో విడిపోయారు.