Dabba Cartel : హితేష్ భాటియా (Hitesh Bhatia) దర్శకత్వం వహించిన ‘డబ్బా కార్టెల్’ (Dabba Cartel) అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరిలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఫిబ్రవరి 18న ఈ వెబ్ సిరీస్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్ కు షబానా అజ్మీ (Shabana Azmi), గజరాజ్ రావు, జ్యోతిక (Jyothika), నిమిషా సజయన్, షాలిని పాండే తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటి షబానా జ్యోతికకు సంబంధించిన ఆసక్తికరమైన స్టోరీని వెల్లడించింది.
జ్యోతికను తీసేయమని చెప్పాను – షబానా
బాలీవుడ్ లెజెండరీ నటి షబానా అజ్మీ కొత్త సిరీస్ ‘డబ్బా కార్టెల్’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో జ్యోతిక కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా షబానా తన తప్పును అంగీకరించి, అసలేం జరిగిందో చెప్తూ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ సిరీస్‌లో జ్యోతిక స్థానంలో నటించాలని తాను మొదట కోరుకున్నానని ఆమె అందరి ముందు ఒప్పుకుంది. ఈ సిరీస్ కోసం నటీనటుల ఎంపిక జరుగుతున్నప్పుడు, జ్యోతికను ఇందులో సెలెక్ట్ చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె వెల్లడించింది.
షబానా మాట్లాడుతూ “నేను ఈ సిరీస్ నుండి ఇద్దరు అమ్మాయిలను తొలగించాలనుకున్నాను. అందులో జ్యోతిక కూడా ఒకరు. ఈ విషయం గురించి ఆమెకు తెలియకపోవచ్చు. కానీ ఈ సినిమా నిర్మాతలకు నేను క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే ఆమెను సిరీస్ నుంచి తప్పించాలని అడిగినప్పుడు, నువ్వు ఏది కావాలంటే అది చేసుకో… కానీ జ్యోతికను మాత్రం తప్పించేది లేదని స్పష్టంగా చెప్పారు నిర్మాతలు. జ్యోతిక ఈ పాత్ర పోషించినందుకు నేను కృతజ్ఞురాలిని. ఆమెను తొలగించాలి అనుకోవడం నా తప్పు. ఈ తప్పు వల్ల మీతో కలిసి పని చేసే అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయేదానిని” అంటూ క్షమాపణలు చెబుతూనే, జ్యోతికపై ఆవిడ ప్రశంసల వర్షం కురిపించారు.
‘డబ్బా కార్టెల్’ గురించి షబానా మాట్లాడుతూ “నాకు ఇది ఫ్యామిలీ విషయం. కోడలు ఆజ్ఞ ఇచ్చింది. నా కొడుకు దాన్ని నిర్మిస్తున్నాడు. నాకు వద్దు అని చెప్పే అధికారం లేదు. నేను ఉత్సాహంగా నా పాత్రను చేస్తానని చెప్పాను” అని అన్నారు.
స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ?
‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 28న స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో షబానా అజ్మీ, జ్యోతికలతో పాటు, సాయి తమహంకర్, నిమిషా సజయన్, షాలిని పాండే, జిషు సేన్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సిరీస్ లో ఎక్కువగా లేడీ యాక్టర్స్ నటిస్తుండడం విశేషం.
ఈ సిరీస్ లో స్టోరీ మొత్తం థానే నగర శివారులలో జరుగుతుంది. లంచ్ బాక్స్ డెలివరీ సర్వీస్ కోసం పని చేసే ఐదుగురు మహిళల ప్రయాణాన్ని, డేంజరస్ డ్రగ్ డెలివరీ ఆపరేషన్ ను ఈ సిరీస్ లో చూడవచ్చు. వారి సాధారణ వ్యాపారం… నేరం, మోసం, ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఏం జరిగింది ? అనేది ఆసక్తికరంగా ఉండబోతోంది.