Shah Rukh Khan: బాలీవుడ్‌లో స్టార్ల ప్రాణాలకు భారీ ముప్పు పొంచి ఉందని ఈమధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని పెంచుకొని ప్రాణ భయంతో తిరుగుతున్నాడు. ఇంతలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు కూడా హత్య బెదిరింపులు వచ్చాయనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్, షారుఖ్.. వీరిద్దరూ హీరోలుగా పరిచయమయినప్పటి నుండి కొందరు గ్యాంగ్‌స్టర్స్‌కు టార్గెట్ అయ్యారు. ఇప్పుడు వీరికి నేరుగా హత్య బెదిరింపులు రావడం అనేది ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
ఛత్తీస్‌గఢ్ నుండి బెదిరింపులు
ముంబాయ్‌లోని బాండ్రా పోలీసులు చెప్తున్నదాని ప్రకారం.. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు ఒక హత్య బెదిరింపు కాల్ వచ్చిందట. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ అనే వ్యక్తి పేరుపై నమోదయిన ఫోన్ నెంబర్ నుండి షారుఖ్‌కు ఈ కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే నిజంగానే హత్య బెదిరింపులకు పాల్పడింది ఈ వ్యక్తేనా? లేక మరెవరైనా తన పేరు, నెంబర్ ఉపయోగించి ఈ పనిచేశారా అని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ప్రాణ భయంతో బ్రతుకుతుండగా.. షారుఖ్ ఖాన్ కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయినా ఈ స్టార్ హీరోలకు ఇలాంటి బెదిరింపులు కొత్త కాదు.
Also Read: ‘సిటాడెల్.. హనీ బన్నీ’ వెబ్ సిరీస్ రివ్యూ
భారీ సెక్యూరిటీ
లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) అనే గ్యాంగ్‌స్టర్‌కు టార్గెట్ అయ్యాడు సల్మాన్ ఖాన్ (Salman Khan). ఇప్పటికే తన వల్ల సల్మాన్‌కు ఎన్నో ఏళ్ల నుండి ప్రాణహాని ఉంది. కానీ ఈమధ్య కాలంలో సల్మాన్‌పై హత్యా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల తన ఇంటి వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు కూడా జరిపారు. అంతే కాకుండా తన సోదరుడితో కలిసి లారెన్స్ బిష్ణోయ్.. ఎన్నోసార్లు సల్మాన్‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈమధ్య ఈ వార్నింగ్స్ ఎక్కువ అవుతుండడంతో ఎక్కడికి వెళ్లినా భారీ సెక్యూరిటీతోనే వెళ్తున్నాడు సల్మాన్. బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేయడానికి వెళ్లినా, సినిమా షూటింగ్స్‌కు వెళ్లినా తన చుట్టూ ఎప్పుడూ భారీ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు షారుఖ్ కూడా అలా చేయక తప్పదేమో అనుకుంటున్నారు ప్రేక్షకులు.
స్వయంగా ఒప్పుకున్నాడు
షారుఖ్ ఖాన్ హీరోగా అడుగుపెట్టినప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు. చాలాసార్లు తనకు తన మతమే సమస్యగా మారింది. తను మతాలను పట్టించుకోనని, తనకు అలాంటి భేదాలు ఉండవని ఎన్నిసార్లు చెప్పినా కొందరు నమ్మలేదు. అలా కొందరు గ్యాంగ్‌స్టర్స్‌కు షారుఖ్ టార్గెట్ అయ్యాడు. హీరో అయిన కొత్తలో ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోమని లేదా తమకు మద్దతు ఇవ్వమని కొందరు గ్యాంగ్‌స్టర్స్ తనను స్వయంగా సంప్రదించారని షారుఖ్ స్వయంగా పలుమార్లు బయటపెట్టాడు. అయినా కూడా ఎవ్వరికీ తలవంచని షారుఖ్.. బాలీవుడ్ బాద్‌షా స్టేజ్‌కు ఎదిగాడు. ఇప్పుడు తనపై ఇలాంటి బెదిరింపులు వచ్చినా కూడా బాద్‌షా భయపడడు అని కొందరు ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.