Shah Rukh Khan: సినీ పరిశ్రమలో సక్సెస్ సాధించడం అంత ఈజీ కాదు. అలా సక్సెస్ సాధించిన వారే సూపర్ స్టార్స్ అయ్యి చాలామందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తారు. బాలీవుడ్‌లో అలాంటి స్టార్ ఎవరు అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు షారుఖ్ ఖాన్. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొని బాలీవుడ్‌లో బాద్‌షాగా ఎదిగాడు షారుఖ్. ఆయన జర్నీ, సక్సెస్ ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్. కానీ షారుఖ్‌కు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలోనే సక్సెస్ రాలేదు. ఎన్నో ఫ్లాప్స్ కూడా ఎదుర్కున్నాడు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఒక సమ్మిట్‌లో పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు షారుఖ్ ఖాన్.
అదీ మానసిక పరిస్థితి
షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఆ తర్వాత తనకు హీరో అయ్యే అవకాశం లభించింది. కానీ హీరో అయిన తర్వాత కూడా షారుఖ్ చాలాకాలం వరకు సక్సెస్ చూడలేదు. ఆ సమయంలో మరోసారి కష్టాలు తనను వెంటాడాయి. అవన్నీ దాటుకుంటూ మంచి హీరోగా, మినిమమ్ మార్కెట్ ఉన్న యాక్టర్‌గా, సూపర్ స్టార్‌గా మారడానికి షారుఖ్‌కు చాలా సమయమే పట్టింది. అప్పట్లో బాలీవుడ్ హీరోలు ఎవరూ టచ్ చేయని స్క్రిప్ట్స్‌తో ప్రేక్షకులను మెప్పించాలని అనుకున్నాడు ఈ హీరో. కానీ అదే వర్కవుట్ అవ్వలేదు. అప్పుడు తన మానసిక పరిస్థితి ఎలా ఉండేదో తాజాగా అందరి ముందు ఓపెన్‌గా చెప్పేశాడు షారుఖ్ ఖాన్.
Also Read: మలయాళ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి జాన్వీ పాట్లు.. వర్కవుట్ అయ్యేనా?
అర్థం చేసుకున్నాను
తన సినిమాలు బాగా ఆడని సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లి ఎవరికీ తెలియకుండా ఏడ్చేవాడిని అని బయటపెట్టాడు షారుఖ్ ఖాన్. కానీ మెల్లగా అలా ఎందుకు జరుగుతుందో ఆలోచించాడట. తాను తీసే సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వకపోవడం వల్లే అవి ఫ్లాప్ అవుతున్నాయని గుర్తించాడట. అలా తాను ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో అర్థం చేసుకొని తనను తాను మార్చుకున్నానని తెలిపాడు షారుఖ్ ఖాన్. తాము ఫెయిల్ అయినప్పుడే ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకొని ముందుకు సాగాలని ప్రేక్షకులకు మోటివేషన్ ఇచ్చారు. మనం ఎలా ఉన్నా ఏం చేసినా జీవితం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నాడు.
టైమ్ అయిపోలేదు
కెరీర్ మొదట్లో మాత్రమే కాదు.. కొన్నేళ్ల క్రితం వరకు కూడా షారుఖ్ ఖాన్‌కు అసలు సరైన హిట్ లేదు. బ్యాక్ టు బ్యాక్ అరడజనుకు పైగా ఫ్లాప్స్ వచ్చాయి. కమర్షియల్ సినిమా అయినా, డిఫరెంట్ స్టోరీ అయినా, స్క్రిప్ట్ కోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నా.. ఏం చేసినా షారుఖ్‌కు అసలు హిట్ పడలేదు. అలాంటి సమయంలోనే 2023 షారుఖ్‌కు కమ్ బ్యాక్ ఇయర్‌గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లతో తన టైమ్ ఇంకా అయిపోలేదని నిరూపించుకున్నాడు షారుఖ్. ఏకంగా ఆ మూడు సినిమాలతో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఆ జోష్‌తోనే తన తరువాతి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అప్‌కమింగ్ సినిమాలపై ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు.