Putin India Tour : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అయితే.. రష్యా అధ్యకుడి పర్యటనకు సంబంధించిన తేదీలు ఖరారు కాలేదని తెలిపిన రష్యా.. ఆ విషయమై ఇరు దేశాల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు.
ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి మిగతా ప్రపంచ దేశాలు రష్యాను బహిష్కరించాయి. దానితో వాణిజ్యాన్ని తగ్గించుకుంటూ వచ్చాయి. కానీ, భారత్ మాత్రం పాశ్చాత్య దేశాలను భిన్నంగా వ్యవహరిస్తూ వస్తోంది. తమకు అన్ని దేశాలు ఒకే అని తేల్చి చెప్పిన భారత్.. రష్యాతోనూ గతంలోలానే స్నేహం చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో రష్యాలోని కజన్ లో అక్టోబర్ లో నిర్వహించిన బిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. అప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ… పుతిన్ ను భారత్ లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. బిక్స సదస్సుకు ముందు జులైలో సైతం మోదీ రష్యాల పర్యటించారు.
ఉక్రెయిన్ – రష్యా ల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడే రష్యాలో పర్యటించిన మోదీ.. తమ సందేశాన్ని అందించారు. యుద్ధం తమ విధానం కాదన్న మోదీ.. చర్చలు, పరస్పర సమావేశాల ద్వారా ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అనేక సార్లు.. ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్, అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. భారత్ సాయాన్ని కోరారు. యుద్ధ సంక్షోభంలోని ఇరుదేశాలకు.. భారత్ స్నేహితుడు కావడం, ఇరు దేశాలతో సంప్రదింపులు జరిపే స్వేచ్ఛ భారత్ కు ఉండడంతో సయోధ్యకు భారత్ నిజమైన వేదిక అంటూ వెల్లడించారు. కానీ.. ఇప్పటి వరకు.. ఆయా దేశాల మధ్య చర్చలకు నేరుగా అంగీకరించని భారత్.. ఇకమీదట ఏమైనా శాంతి చర్చలకు వేదికగా మారుతుందేమో చూడాలి.