Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ స్టార్ హీరోల సినిమాల పేర్లు తెగ వాడేస్తున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ మూవీ నారీ నారీ నడుమ మురారి టైటిల్ ను తన సినిమాకు వాడేసుకున్న శర్వానంద్ తాజాగా పవన్ కళ్యాణ్ క్లాసిక్ టైటిల్ ను తీసుకోబోతున్నట్టు టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న శర్వానంద్ నెక్స్ట్ మూవీకి ‘జానీ’ పేరును దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం.
శర్వానంద్.. క్లాస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఇప్పుడు ఈ హీరో కొత్తదారిలో అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టేసాడు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ నారీ నారీ నడుమ మురారి టైటిల్ ను తన సినిమాకు వాడేసిన శర్వానంద్… పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ సినిమా పేరును తన తదుపరి చిత్రానికి టైటిల్ గా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పేరు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. ఈ విషయంపై అధికార ప్రకటన త్వరలోనే రావాల్సి ఉంది.
టాలీవుడ్ క్రేజీ హీరో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జానీ. ఈ సినిమాలో పవన్ సరసన రేణు దేశాయ్ నటించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ పవన్ కు ప్రత్యేక క్రేజ్ సంపాదించి పెట్టింది. మరి 2003లో రిలీజైన ఈ సినిమా టైటిల్ ను దాదాపు 23 ఏళ్ల తర్వాత శర్వానంద్ మళ్లీ తెరపైకి తీసుకురావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఈ విషయాన్ని మెగా ఫాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
జానీ పేరు ఈ సినిమాకు ఫిక్స్ అయితే మరో క్రేజీ టైటిల్ తో శర్వానంద్ రాబోతున్నట్టే. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. నారీ నారీ నడుమ మురారి సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమాను మొదలుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ALSO READ : క్వాలిటీ సినిమాలు తీసే నిర్మాత సినిమాకే బజ్ లేదు
ఇక ఇప్పటికే పవన్ క్రేజ్ బేస్ చేసుకుని ఎందరో హీరోలు ఆయన సినిమా పేర్లు వాడేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ – సమంత కాంబినేషన్లో వచ్చేసిన ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది. మెగా హీరో వరుణ్ తేజ్ – రాశీ ఖన్నా నటించిన సినిమాకు సైతం తొలిప్రేమ పేరు వాడేసుకున్నాడు. త్వరలోనే హీరో నితిన్ తమ్ముడు సినిమా టైటిల్ తో రాబోతున్నట్టు సమాచారం. యాంకర్ ప్రదీప్ సైతం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో త్వరలోనే రాబోతున్నాడు. సుస్వాగతం సినిమా టైటిల్ తో కూడా త్వరలోనే ఓ హీరో నటించబోతున్నాడని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్.. అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చే టైమ్ కి పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్ ఏం మిగలవ్ అంటూ తెగ హైరానా పడిపోతున్నారంట. నిజానికి ఇన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ఇంత క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ చేసిన సినిమాలు 30లోపే. మరి ఇప్పటికే ఇన్ని టైటిల్స్ ఇతర హీరోలు వాడేస్తుంటే మిగిలేవి ఎన్ని అంటూ ఫీల్ అయిపోతున్నారని టాక్. మరి బండ్ల గణేష్ బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కు కోట్లలో చెల్లించి సొంతం చేసుకున్న గబ్బర్ సింగ్ లాంటి టైటిల్స్ మిగిలితే అఖిరా నందన్ కాస్త సేఫ్ జోన్ లో ఉన్నట్టే. మరి ముందు ముందు ఎలా ఉంటుందో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.