INDIA Alliance Delhi Elections | కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి ఏర్పడినప్పుడు, ఎన్నికల సమయంలో స్థానిక పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పోటీ చేయకుండా, ఆ పార్టీలకే అవకాశం ఇవ్వాలని.. అలాగే జాతీయ స్థాయిలో లోక్ సభ ఎన్నికల వేళ ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో బలంగా ఉందో ఆ పార్టీ మాత్రమే ఆ సీటుపై పోటీ చేయాలనే ఒప్పందంతో ఇది ఏర్పడింది. కానీ బిజేపీని ఎదుర్కోవడానికి కూటమి కట్టిన విపక్ష పార్టీలు ఇప్పుడు ఒకదానిపై ఒకటి కత్తులు దూసుకుంటున్నాయి. ఇది ఢిల్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ వివాదం
ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే అప్పటికే లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పొందడంతో ఆప్ ఈ డిమాండ్‌కు అంగీకరించలేదు. దీంతో రెండు కూటమి పార్టీలు ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి. ఫలితంగా, కాంగ్రెస్ ఆప్ విడివిడిగా పోటీ చేసి, బిజేపీకి అధికారం కట్టబెట్టాయి. ఆప్ అధికారం కోల్పోవడంతో, దేశంలో ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎనిమిదికి పడిపోయింది. కర్ణాటక, జమ్మూకశ్మీర్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే ఇండియా కూటమి ప్రభుత్వాలు మిగిలాయి.
కూటమిలో విభేదాలు
బిజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో లోక్ సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి కేంద్రంలో బిజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయినా, బిజేపీకి మెజారిటీ రాకుండా నిరోధించగలిగింది. అయితే, జాతీయ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరించడంతో కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. చాలా రాష్ట్రాల్లో కూటమి ఐక్యత దెబ్బతింది.
Also Read: ఆప్‌ని ఓడించాలంటే ప్రధాని మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది.. కేజ్రీవాల్ వైరల్ వీడియో
కాంగ్రెస్, ఆప్ మధ్య ఘర్షణ
ఇండియా కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేసింది. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా లాంటి సీనియర్ నేతలు ప్రచారంలో ఆప్‌పై, ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఆప్‌కు అండగా నిలిచాయి. గత కొంతకాలం నుంచి గమనిస్తే.. కూటమిలోని ఇతర పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. హరియాణా ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదుర్చుకోలేకపోయాయి. ఢిల్లీలో కూడా అదే జరిగింది.
రాష్ట్ర ఎన్నికల్లో కూటమి ఐక్యత
బిహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి సమైక్యంగా కనిపిస్తున్నప్పటికీ, రానున్న ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూటమి ఐక్యతకు పరీక్ష పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చాలా మంది విపక్ష నేతలు నిరాశ వ్యక్తం చేశారు. ఢిల్లీలో బిజేపీకి అధికారం దక్కడానికి కారణం ఇండియా కూటమిలో విభేదాలే అని సీపీఎం, ఐయూఎంఎల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభించడం లేదు. కూటమి బలోపేతానికి ఆ పార్టీ కృషి చేయడం లేదు. బాధ్యతగా ప్రవర్తించడం లేదు” అని సీపీఎం నేత టి.పి.రామకృష్ణన్ వ్యాఖ్యానించారు.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందన
ఢిల్లీ ఎన్నికలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) స్పందిస్తూ, ఆప్, కాంగ్రెస్‌లకు చురకలు అంటించారు. ఢిల్లీలో బలం ఉన్న ఆప్‌కు కాంగ్రెస్ సహకరించలేదని, అందువల్లే ఎన్నికల ఫలితాల్లో వెనకబడ్డారని ఆయన మండిపడ్డారు. “ఇంకా మీలో మీరే కొట్టుకుంటూ ఉండండి” అంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు సున్నా సీట్లు
బిజేపీ పాతికేళ్ల నిరీక్షణ ఫలించింది. దశాబ్దకాలంగా ఢిల్లీ పీఠంపై తిష్ఠ వేసుకొని కూర్చొన్న ఆప్ మట్టికరిచింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి సున్నా స్థానాలకు పరిమితమైంది. శనివారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తూ మీమ్స్ చెలరేగాయి. ఢిల్లీలో గెలవాలంటే మోదీ మరో జన్మ ఎత్తాలన్న కేజ్రీవాల్ మాటలను గుర్తుచేస్తూ పలువురు పోస్టులు పెట్టారు. 2023లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో మీమ్స్
గోనె సంచులతో పరుగుపందెంలో ఊహించినట్టే బిజేపీ ముందుకు దూసుకుపోతుండగా, దాని వెనుక ఆప్ పరుగు.. ఈ రెండింటికీ పూర్తి భిన్నమైన దిశలో కాంగ్రెస్ వెదుకులాడుతున్న వీడియో వైరల్ అయింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ సున్నా ఫలితాలు సాధించడంపై పెట్రోలుబంకు వద్ద రాహుల్ పెట్రోలు పడుతూ “సున్నా చూసుకోండి సర్” అంటున్న మీమ్ బాగా వైరల్ అయింది. ఆప్ ఎందుకు ఓడిపోయిందన్న ప్రశ్నకు చాలా వేళ్లు కేజ్రీవాల్‌కు ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతీ మాలీవాల్‌కు మధ్య జరిగిన ‘డ్రామా’ను కారణంగా చూపిస్తుండగా, ఆప్ ఓటమిలో అసలు ఓటర్ల కంటే ఆమె కీలకపాత్ర పోషించారని కొందరు వ్యాఖ్యలు చేశారు.
మరో మీమ్‌లో ఆప్ నేత సంజయ్ సింగ్ పై ట్రోల్ చేశారు. “మందిర్ కే అందర్ గయాతో హల్వా ఖతం, ఔర్ బాహర్ ఆయాతో చప్పల్ గాయబ్” (గుళ్లోకి వెళితే హల్వా అయిపోయింది, బయటకు వచ్చి చూస్తే చెప్పులు మాయం) అంటూ వ్యాఖ్యలు పెట్టారు. ఎన్నికల్లో ఆప్ ఓటమి, ప్రముఖ నేతల భంగపాటును ఇది సూచిస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఈ విభేదాలు ఎలా పరిష్కరించబడతాయో అనేది ఇండియా కూటమి భవిష్యత్తును నిర్ణయిస్తుంది.