Shraddha Srinath.. నాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath). తెలుగులో చేసింది మొదటి సినిమానే అయినా తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది. ఆ క్రేజీతో తెలుగు, తమిళ్, మలయాళం,కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నటసింహా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాలో నటించింది. ఈ సినిమా విజయం అందుకోవడంతో అటు చిత్ర బృందం కూడా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే..
ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా శ్రీనాథ్ గతంలో తనపై వచ్చిన విమర్శలకు స్పందించింది.
సంవత్సరం కూడా ఇండస్ట్రీలో ఉండదన్నారు..
శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. “విభిన్నమైన పాత్రలు పోషించినప్పుడే నటిగా మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అందుకే పాత్రల ఎంపిక విషయంలో ప్రతిసారి కూడా కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాను. ఏ అవకాశం పడితే అది అందుకొని ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే టైప్ మాత్రం నేను కాదు. ఒకటి రెండు చేసినా.. కథలో డెప్త్ ఉండాలి అని అనుకుంటాను. తెలుగులో మొదటి సినిమా జెర్సీ మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాతో మంచి విజయం అందుకున్నాను. నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు ప్రతి సినిమా కూడా ఒక పాఠమే. అందుకే జెర్సీ సినిమా తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చాయి. నేను ఎంత నిజాయితీగా పనిచేశాను అన్నదే నాకు ముఖ్యము. రిజల్ట్ గురించి ఎప్పుడూ కూడా నేను ఆలోచించలేదు. నేను చేసిన సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఒకేలా తీసుకుంటున్నాను. అలాగే నాపై వచ్చే నెగెటివిటీని కూడా నేను పెద్దగా పట్టించుకోను. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఏడాది కూడా చిత్ర పరిశ్రమలో ఉండలేవు అని మా బంధువులు కూడా అన్నారు. అయితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి అభిమానులు కూడా ఒక కారణం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శ్రద్ధా శ్రీనాథ్ కెరియర్..
ఈమె 2015లో మలయాళంలో వచ్చిన ‘కోహినూర్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. 2016లో కన్నడ చిత్రం ‘యూటర్న్’ చిత్రంతో ఏకంగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఇక 2018లో నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మోడల్గా కెరియర్ ఆరంభించిన శ్రద్ధా శ్రీనాథ్ ఉదంపూర్, జమ్మూ కాశ్మీర్లో జన్మించింది. బెంగుళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ లో విద్య పూర్తి చేసిన ఈమె, వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తమిళ్, కన్నడ చిత్రాలతో ఆకట్టుకుంటున్న శ్రద్ధ శ్రీనాథ్ ‘సైంధవ్ ‘సినిమాలో మనోజ్ఞ క్యారెక్టర్ లో నటించింది. ఇక ఇప్పుడు తమిళంలో ‘కలియుగం’ అనే సినిమాతో పాటు హిందీలో ‘లెటర్స్ టు మిస్టర్ ఖన్నా’ అనే సినిమాలలో నటిస్తోంది.