Nalla Indrasena reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏడాదిగా మంటలు రేపుతోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవహారంపై దర్యాప్తు సాగుతుండగా.. ప్రతీ దశలో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ కీలక నేతలే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అనుకున్నారు. కానీ.. ఇందులో గవర్నర్ స్థాయి వ్యక్తుల ఫోన్లు సైతం గుట్టుగా విన్నారనే విషయం పోలీసు వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధాసీదా నేతలనే కాదు, ఏకంగా కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలున్న ఓ కీలక నేత, ఓ రాష్ట్ర గవర్నర్ గా అత్యున్నత రాజ్యాంగ పదవిలోని వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయాలు నివ్వెరపరుస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల సంభాషణల్ని, వారి వ్యవహారాల్ని తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ అనే ఓ అనైతిక, చట్టవిరుద్ధ చర్యలకు అప్పటి ఉన్నతాధికారులు పాల్పడ్డారు. రాష్ట్రస్థాయి నేతలతో పాటు ఏకంగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ నెంబర్ ను సైతం ట్యాప్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. త్రిపుర గవర్నర్ ఓఎస్డీ గా విధుల్లో ఉన్న నర్సింహులు పేరుతో ఓ ఫోన్ నంబరును ట్యాపింగ్ లిస్టులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఎంక్వైరీ చేయగా అది త్రిపుర గవర్నర్, బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ దిగా గుర్తించారు. ఈ నెంబర్ ను నల్లు ఇంద్రసేనా రెడ్డి వాడుతుండడంతో.. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్‌ఐబీ) కేంద్రంగా ఈ ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు.
ఈ కేసులో కీలక సూత్రధారి అయిన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా పారిపోయిన నేపథ్యంలో.. వివరాలు తెలుసుకునేందుకు నర్శింహులను పిలిపించిన హైదరాబాద్ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. దాంతో ఆశ్చర్యపోయిన నర్శింహులు.. పోలీసులు చెప్పే వరకు తనకు ఆ విషయం తెలియదని అన్నారు. అతని వాంగ్మూలం తీసుకున్న పోలీసలు.. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో బడా, బడా నేతలు బాధితులుగా ఉండడం.. కేంద్ర, రాష్ట్ర స్థాయి వ్యక్తుల వ్యక్తిగత ఫోన్లు ట్యాప్ కావడంతో పోలీసులు చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నారు. త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలోనే గతంలో తెలంగాణ గవర్నర్ గా పని చేసిన తమిళి సై ఆరోపణలకు ప్రాధ్యాన్యత పెరిగింది. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు ఆమె అప్పట్లో ఆరోపించారు. కానీ.. ఇప్పటి వరకు దర్యాప్తులో తమిళి సై ఫోన్ ట్యాపింగ్ వివరాలు తెలియలేదంటున్నారు. అయితే.. రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చని, ఇంకా ఎవరెవరి నంబర్లు వెలుగు చూస్తాయోనని అంటున్నారు.
నల్లు ఇంద్రసేనా రెడ్డి టార్గెట్ ఎందుకయ్యారు..
ఇంద్రసేనా రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. పార్టీలో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేత కావడం, చాలా సీనియర్ కావడంతో పెద్ద, పెద్ద వాళ్లతో సంబంధాలన్నాయి. నల్లు మూడుసార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పని చేయగా, ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ కార్యదర్శిగానూ ఉన్నత పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. దీంతో.. ఆయనకు రాష్ట్ర బీజేపీ నాయకులతో పాటు కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలున్నాయి.
Also Read : అధికారాలు గుంజుకోవడానికి కుట్ర.. సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్
అందుకే.. నల్లు ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తే బీజేపీ కి చెందిన కీలక విషయాలు తెలుసుకోవచ్చని భావించి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్లు ఇంద్రసేనా రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తి, ఏకంగా ఓ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. అయినా.. ఎలాంటి అదురూబెదురు లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. ఈ విషయం తెలియడంతో.. అసలు ఇంత మంది బడా లీడర్ల పై నిఘా వేసేందుకు.. ఎంత పెద్ద స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయి. వారికి అంత ధైర్యం ఎవరు కల్పించారనే విషయాల్లో అనేక ఊహగానాలు నడుస్తున్నాయి.