Silk Smitha:సిల్క్ స్మిత(Silk Smitha).. నటనలోనే కాదు లావణ్యంలో కూడా ఆమె తర్వాతే ఎవరైనా.. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఎక్కువగా గ్లామర్ పాత్రలతో అలరించింది. అంతేకాదు స్పెషల్ సాంగ్ లు చేస్తూ అప్పట్లో కుర్రకారు ఫేవరెట్ గా మారిపోయింది. అలాంటి సిల్క్ స్మిత అనూహ్యంగా మరణించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈమె మరణం ఒక మిస్టరీనే. ఇప్పటివరకు ఈమె మరణం గురించి పలువురు పలు రకాలుగా కామెంట్లు చేసినా.. సరైన కారణాలు మాత్రం ఎవరు చెప్పలేకపోయారు. దీనికి తోడు కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టిన సిల్క్ స్మిత.. ఇప్పుడు ఆ డబ్బంతా ఏమైపోయింది..? ఎవరు తీసుకున్నారు? అసలు సిల్క్ స్మిత మరణం వెనుక ఎవరి హస్తమైనా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వీటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టేశారు సిల్క్ స్మిత తమ్ముడు నాగవరప్రసాద్ (Naga varaprasad). తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అక్క సిల్క్ స్మిత గురించి ఆమె మరణం గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టారు.
మా అక్కను వారే చంపేసారు..
సిల్క్ స్మిత తమ్ముడు నాగవరప్రసాద్ మాట్లాడుతూ.. “మాది నిరుపేద కుటుంబం. మా ఇంట్లో ఎవరూ కూడా పెద్దగా చదువుకోలేదు. మా అక్క మాత్రం అదృష్టం కొద్దీ సినిమాలలోకి వెళ్లి స్టార్ అయిపోయింది. నాది మోటార్ ఫీల్డ్. మా అక్కను చూడడానికి అప్పుడప్పుడు నేను మద్రాస్ కూడా వెళ్తూ వస్తుండే వాడిని. నా కష్టం చూసి ఒక కారు కూడా కొనిపెట్టింది. ఆమె ఎన్నో భాషలలో నటిస్తూ బిజీగా ఉండేది. డబ్బు కూడా బాగా సంపాదించింది. అలాంటి పరిస్థితులలో ఆమె డబ్బు చూసి ఒక వ్యక్తి ఆమెకు దగ్గరయ్యాడు. ఆయనకే అప్పటికే భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ మా అక్క మాత్రం అతడిని గుడ్డిగా నమ్మింది. ఒకరోజు రాత్రి మా అక్క డబ్బు కోసమే అతడు, అతని పిల్లలు కలిసి మా అక్కను చంపేశారు. డబ్బు, నగలు, డాక్యుమెంట్లు అన్నీ కాజేశారు. మేము వెళ్లేలోగా అందరిని మేనేజ్ చేశారు. మాకా చదవలేదు మా దగ్గర డబ్బు కూడా లేదు. అక్కడ మాకు ఎవరి నుంచి ఎలాంటి సపోర్టు లేదు. దాంతో మేము ఏం చేయాలో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మా అక్క మరణించింది అని తెలియడంతో ఆమెను చూడడానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. అయితే ఇండస్ట్రీ నుంచి కేవలం అర్జున్ (Hero Arjun) మాత్రమే వచ్చారు. ఇక మా అక్కను ఎవరు పట్టించుకోలేదు.ఏం చేయాలో తెలియక మా అక్క శవాన్ని పట్టుకొని మేమంతా రోడ్డుపై నిలబడిపోయాము.
మొత్తం దోచుకున్నారు..
మా అక్క అప్పట్లోనే రూ.20 కోట్లకు పైగా సంపాదించింది. ఆ డబ్బంతా ఏమైపోయింది? అంత మంచి మనిషికి ఇంతటి అన్యాయం జరిగితే అందరూ ఏం చేస్తున్నారు? నా మీద ఒట్టేసి చెబుతున్నాను.. మా అక్క చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన ఏ ఒక్క రూపాయి కూడా మాకు చేరలేదు” అంటూ ఆమె తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రస్తుతం నాగ వర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు సిల్క్ స్మితను మోసం చేసిన ఆ వ్యక్తిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.