Singer Aditi Bhavaraju: ఇటీవల కాలంలో ఎంతోమంది తమలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఇండస్ట్రీలో గొప్ప గొప్ప అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు హీరోలుగా మారి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా సింగర్లు కూడా హీరో, హీరోయిన్లుగా అవకాశాలు అందుకుంటున్న సందర్భాలు చోటుచేసుకున్నాయి.. సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ (Play Back Singer) గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ ఆదితి భావరాజు (Aditi Bhavaraju)ఒకరు. ఈమె ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు.
గ్రామీణ నేపథ్యంలో…
ఇలా ఇండస్ట్రీలో తెర వెనుక ఉంటూ అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతోమందిని సందడి చేసిన అదితి వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈమె హీరోయిన్ గా “దండోరా” (Dandora)అనే సినిమాలో అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా తెలంగాణలో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ప్రేమ కథతో పాటు, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలను కూడా కీలకంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సింగర్ అదితి భావరాజు హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా నవదీప్, నందు, శివాజీ, రవికృష్ణ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నట్టు సమాచారం.
హీరోయిన్ గా టాప్ సింగర్…
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కబోతోంది. ఈ నిర్మాణ సంస్థ నుంచి ఇదివరకే కలర్ ఫోటో వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలర్ ఫోటో, బెదురులంక 2012 వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు దండోరా వంటి సినిమాని ప్రేక్షకులకు పరిచయం చేయటానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాకు మురళి కాంత్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ బీట్ టీజర్ కు విశేష స్పందన లభించడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలను కూడా పెంచేసింది.
ప్రస్తుత ఈ చిత్రం తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాలలో షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది. ఇటీవల కాలంలో గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు మంచి ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. మైక్ చేత పట్టి తన అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకున్న అదితి ఇప్పుడు ఆ మైక్ పక్కన పెట్టి మొహానికి మేకప్ వేసుకొని సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను సందడి చేయటానికి సిద్ధమవుతుంది. మరి వెండితెరపై అదితి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? హీరోయిన్ గా వెండితెరపై సక్సెస్ అందుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.