Sreeleela: ఒక భాషలో హీరోయిన్‌గా పాపులారిటీ వచ్చిన తర్వాత నటీమణులంతా వేరే భాషల్లో తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా సౌత్ హీరోయిన్లకు బాలీవుడ్ తెరపై వెలిగిపోవాలనే కోరిక ఉంటుంది. అందుకే సౌత్‌లో ఒకట్రెండు హిట్లు పడగానే బీ టౌన్‌లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు యంగ్ బ్యూటీస్. ఇంకా గత కొన్నాళ్లు నుండి సోషల్ మీడియాలో, సినీ సర్కిల్లో ఎక్కడ చూసినా శ్రీలీల పేరే వినిపిస్తోంది. అందుకే శ్రీలీల కూడా బాలీవుడ్ కలలు కంటోంది. ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తన చేతి వరకు వచ్చి వెళ్లిపోయాయి. తాజాగా మరో యంగ్ హీరో సినిమాతో శ్రీలీల సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
విపరీతమైన పాపులారిటీ
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’లో కిస్సిక్ అనే ఐటెమ్ సాంగ్‌లో నటించింది శ్రీలీల. తెలుగులో మాత్రమే కాకుండా ఈ పాట అన్ని భాషల్లో బ్లాక్‌బస్టర్ అయ్యింది. అలా శ్రీలీలకు ఒక్క పాటతోనే విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఒకప్పుడు ఐటెమ్ సాంగ్ అంటేనే దూరంగా ఉంటానన్న శ్రీలీల.. ‘పుష్ప 2’ లాంటి పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ రాగానే నో చెప్పలేకపోయింది. దానివల్ల తనకు చాలా పాజిటివ్స్ కూడా జరిగాయి. అలా ఇప్పటివరకు తనకు బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రాని ఛాన్స్ కూడా కిస్సిక్ వల్ల వచ్చింది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ‘96’ సీక్వెల్ స్టోరీ లీక్.. రామ్, జాను మళ్లీ కలుస్తారా.?
టైటిల్ ఫిక్స్
యూత్‌కు కనెక్ట్ అయ్యే కథలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). అంతే కాకుండా ‘భూల్ భూలయ్యా’ ఫ్రాంచైజ్‌తో కూడా తన మార్కెట్ పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్‌తో మొదటిసారి చేతులు కలుపుతూ ఒక రొమాంటిక్ డ్రామాలో నటించనున్నాడు. దానికి సంబంధించిన అధికారిక వీడియో కూడా బయటికొచ్చింది. ఈ మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. ‘తూ మేరి మే తేరా, మే తేరా తూ మేరీ’ అంటూ టైటిల్‌ను రివీల్ చేస్తూ వీడియో విడుదల చేశారు మేకర్స్. కానీ ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అయినా శ్రీలీల మాత్రం హీరోయిన్‌గా ఫిక్స్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
వర్కవుట్ అవుతుందా
శ్రీలీల (Sreeleela) స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుందని, కార్తిక్ ఆర్యన్‌తో తన పెయిర్ చాలా బాగుంటుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. కానీ ప్రస్తుతం ఈ పెయిర్ ఇంకా టాకింగ్ స్టేజ్‌లోనే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దానివల్లే ఇప్పటివరకు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా వదులుకుంది. వరుణ్ ధావన్‌తో సినిమాను కూడా డేట్స్ కారణంగానే వదిలేసుకుంది శ్రీలీల. ఇప్పుడు కార్తిక్ ఆర్యన్‌తో అయినా సెట్ అవుతుందా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని సమీర్ విద్వాన్స్ డైరెక్ట్ చేయనున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి సిద్ధమయ్యింది.