Oh Bhama Ayyo Rama Teaser: సింపుల్ స్టోరీలను ఎంచుకుంటూ, ముఖ్యంగా మిడిల్ క్లాస్‌కు కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకుంటూ అందరి దృష్టిలో పక్కింటబ్బాయి ఇమేజ్‌తో వెలిగిపోతున్నాడు సుహాస్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ప్రామిసింగ్ యంగ్ హీరోల్లో సుహాస్ పేరు కూడా ఉంటుంది. సుహాస్ సెలక్ట్ చేసుకున్నాడంటే ఆ కథ, ఆ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది అని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే హీరోగా ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకున్న తను.. ఇప్పుడు మరో సింపుల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అదే ‘ఓ భామ అయ్యో రామ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా దీనికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
అబద్ధాలు చెప్పే అమ్మాయి
నవ్వుతూ నడుచుకుంటూ వస్తున్న హీరోయిన్ మాళవికా మనోజ్‌ను చూసి సుహాస్ ఫ్లాట్ అవ్వడంతో ‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ మొదలవుతుంది. వెంటనే క్యూట్‌గా కనిపించే హీరోయిన్‌లో ఒక రఫ్ యాంగిల్ కూడా ఉందని తెలుసుకుంటాడు. ఆపై మాళవికా వల్లే చిక్కుల్లో పడతాడు. తను సందర్భాన్ని బట్టి ఈజీగా అబద్దాలు చెప్పడం చూసి షాకవుతాడు. కొందరికి తనను లవర్ అని, కొందరికి తనను భర్త అని చెప్పి పరిచయం చేస్తూ ఈజీగా అబద్ధాలు ఆడేస్తుంది మాళవికా. నచ్చింది చేసేస్తూ ఆపై ‘‘మనది బొమ్మరిల్లు సినిమా కాదు.. రక్తచరిత్ర’’ అంటూ సుహాస్‌కు వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే సీన్‌లోకి హీరోయిన్ తండ్రిగా పృథ్వి ఎంట్రీ ఇస్తాడు.
అదే హైలెట్
మాళవికా మనోజ్‌ను ప్రేమించడం చాలా రిస్క్ అని తెలుసుకుంటాడు సుహాస్. తనను కొందరు చంద్రముఖితో పోలిస్తే.. తను మాత్రం సత్యభామతో పోలుస్తాడు. ఇక ‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ మొత్తంలో హైలెట్‌గా నిలిచింది చివర్లో వచ్చిన డైలాగే. ‘‘బాబు.. అమ్మాయిలను నమ్మొద్దు బాబు.. అనుభవించి మరీ చెప్తున్నాను బాబు.. మోసం చేసేస్తారు బాబు.. అస్సలు అమ్మాయిలను నమ్మొద్దు బాబు’’ అంటూ ముష్టివాడి గెటప్‌లో సుహాస్ చెప్పే డైలాగ్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది. అలా టీజర్ అంతా చాలావరకు స్టోరీ ఏమీ రివీల్ అవ్వకుండా ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. అలా చాలామంది ఈ సింపుల్ స్టోరీ నచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అరెరే.. అవి లేవట, కుర్రాళ్లకు ఎక్కుద్దా? ‘మ్యాడ్ స్క్వేర్’ సెన్సార్ రిపోర్ట్ ఇదే
రిలీజ్ డేట్ తెలీదు
రామ్ గోదాల దర్శకత్వంలో సుహాస్ (Suhas), మాళవికా మనోజ్ (Malavika Manoj) నటించిన చిత్రమే ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama). గతేడాది సుహాస్ ఏకంగా అయిదు సినిమాల్లో హీరోగా అలరించాడు. అందులో చాలా వరకు సినిమాలు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్న సుహాస్.. ఇప్పుడు యూత్ కోసమే ‘ఓ భామ అయ్యో రామ’తో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో పాటు తన చేతిలో మరో మూడు సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వకపోయినా.. సమ్మర్‌లోనే దీని విడుదల ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.