Sumalatha – Darshan: కన్నడ హీరో దర్శన్ (Darshan) తన సినిమాల ద్వారా కాకపోయినా.. ఒక అభిమానిని హత్య చేసిన కేసులో ఇరుక్కొని, బాగా పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు జైలు జీవితం అనుభవించి, ఇటీవలే బెయిల్ మీద వచ్చిన ఆయనకు ఇంకా ఈ కేసు నుంచి పూర్తి ఉపశమనం కలగలేదని చెప్పవచ్చు. ఇక ఇలాంటి సమయంలో హీరో దర్శన్ చేసిన ఒక పని అందరిలో సరికొత్త అనుమానాలకు దారితీసింది. ముఖ్యంగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఆరుగురుని ఫాలో అవుతుండగా.. వారందరినీ అన్ ఫాలో చేయడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ సీనియర్ హీరోయిన్ సుమలత (Sumalatha) ఎప్పటినుంచో దర్శన్ తనకు కొడుకు లాంటివాడు అంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో సడన్గా దర్శన్ సోషల్ మీడియా ఖాతాలో అన్ ఫాలో చేసిన వారిలో సుమలతతో పాటు ఆమె కొడుకు కూడా ఉన్నారు.
హాట్ టాపిక్ గా మారిన సుమలత పోస్ట్..
సరిగ్గా ఇలాంటి సమయంలోనే సుమలత తన ఇన్స్టా లో పోస్ట్లు పెట్టడంతో సరికొత్త చర్చలు మొదలయ్యాయి. అసలు విషయంలోకి వెళ్తే.. సుమలత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. “తిమ్మినిబమ్మి చేసి, కాస్తైనా పశ్చాత్తాపపడకపోగా.. ప్రజలను బాధిస్తూ.. అవతలి వారిపై తప్పును తోసేవారు ఇప్పటికీ వారిని వారు హీరోలుగా పరిగణించుకుంటున్నారు. వీరికి కదా ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి” అని ఒక పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక మరో పోస్ట్ లో “‘ఎటువంటి విచారం, నొప్పి లేకుండా.. ప్రశాంతంగా నిద్రలేవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం, శాంతియుతంగా గడపడం అనేవి ఒక నిధి లాంటివి. ఇవన్నీ సోషల్ మీడియాలో పనికొస్తాయో లేవో కానీ మన జీవితానికి మాత్రం బలమైన పునాది వేస్తాయి. ఈ అంశాలే మనల్ని మానసికంగా ధనవంతులని కూడా చేస్తాయి..” అంటూ మరో పోస్ట్ షేర్ చేసింది సుమలత. ఇక సుమలత ఇలా రెండు పోస్ట్లు పెట్టడంతో దర్శన్ ను ఉద్దేశించి చేసిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య బంధాలు పూర్తిగా చెడిపోయాయేమో అంటూ కూడా ఎవరికి వారు కథనాలు అల్లేసుకుంటున్నారు.
కథనాలపై క్లారిటీ ఇచ్చిన సుమలత..
అయితే తాజాగా వీటిపై స్పందించింది సుమలత. దర్శన్ సోషల్ మీడియాలో ఎవరినీ ఫాలో అవ్వకూడదని నిర్ణయించుకున్న విషయం నాకు మీడియా వల్లే తెలిసింది. నన్ను ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. దర్శన్ అన్ ఫాలో అవ్వడం, ఆ తర్వాత నేను పోస్ట్ పెట్టడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది. అంతేతప్ప ఇందులో ఏమీ లేదు. అసలే గొడవలేని చోట గొడవ ఉన్నట్టు ఎందుకు సృష్టిస్తున్నారు. నా కుటుంబ సభ్యులు, నా ఆప్తులు అనుకున్న వారితో నేను నేరుగానే మాట్లాడుతాను” అంటూ సుమలత తెలిపింది. మొత్తానికి అయితే సుమలత – దర్శన్ మధ్య బంధాలు చెడిపోయాయి అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది సుమలత. ఇంకా ప్రస్తుతం సుమలత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై దర్శన్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.