Ysrcp VS Vijayasai Reddy: వైసీపీకి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోవడం ఒక సమస్యగా మారింది. నేతల వెళ్తే వెళ్తూ వేస్తున్న బురద తుడుచుకోలేక గింజుకుంటోంది. ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలో తెలియక సతమతమవుతోంది. వైసీపీపై విజయసాయిరెడ్డి కామెంట్స్ చేసిన 24 గంటల తర్వాత వైసీపీ తీరిగ్గా రియాక్ట్ అయ్యింది.
ఈసారి మాటల మాంత్రికుడిగా పేరు గడిస్తున్న గుడివాడ అమర్నాథ్‌ను దించింది. గురువారం ఉదయం విశాఖలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్. విజయవాడలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి.
జగన్ కోటరీ అంటే ప్రజలే ఉంటారన్నారు గుడివాడ. ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉంటుందో లేదా చెప్పాలని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారాయన. మొన్నటివరకు కోటరిలో ఉన్నామని, దాని గురించి మాట్లాడితే అస్సలు ఏమీ బాగుందని సెలవిచ్చారు. వేరే వారు మీద ప్రేమ పెరిగితే.. మిగతా వారి మీద ప్రేమ తగ్గుతుందని, పార్టీ మారిన వ్యక్తి నుంచి అంతకంటే ఏమి ఆశించలేమన్నారు.
వైసీపీలో ఆయన కీలకమైన పదవులు అనుభవించారని అన్నారు మాజీ మంత్రి. రాజకీయాలకు దూరంగా ఉంటానన్న ఆయన, బుధవారం మాట్లాడిన మాటలు చూస్తుంటే తేడాగా ఉందన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆయన పార్టీ నుంచి వెళ్లే పోయేవారా? ఈ విధంగా మాట్లాడేవారా? అంటూ తనదైన శైలిలో మాట్లాడారు.
ALSO READ: ఏపీలోనూ లిక్కర్ స్కామ్, వీఎస్ఆర్ లీక్స్‌తో అరెస్టులు
అన్నట్లు ఢిల్లీలో వీఎస్ఆర్ మాట్లాడిన మాటలకు, విజయవాడలో మాటలకు చాలా తేడా ఉందన్నారు. నిన్నటి మాటలు ద్వారా ఆయన రాజకీయాల్లోకి వెళ్లాలనే విధంగా ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా? రాష్ట్రంలో మూడు వర్గాలున్నాయని చెప్పుకొచ్చారు. ఒకటి కూటమి వర్గమైతే మరొకటి వైసీపీ వర్గమన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లేది మూడో వర్గమన్నారు.
విజయసాయిరెడ్డి వ్యవసాయం చేయరని, రాజకీయమే చేస్తారంటూ ఆయన వ్యాఖ్యలతో అర్థమైందన్నారు గుడివాడ. మీడియా అడిగిన చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు మాజీ మంత్రి. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆయన. గెలుపు ఓటములు సహజమని, దాని గురించి ఆలోచించడం వేస్ట్ అని ముగించేశారు.