Suniel Shetty : బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty) తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని నెమరు వేసుకున్నారు. అమెరికాలో పోలీసులు తన తలకు గన్ గురి పెట్టి, తరువతా మోకాళ్ల పై కూర్చో బెట్టి మరీ అరెస్టు చేశారని చెప్పి షాక్ ఇచ్చారు. మరి బాలీవుడ్లో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న సునీల్ శెట్టికి అమెరికాలో ఇలాంటి అనుభవం ఎదురు కావడానికి గల కారణం ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
అమెరికాలో సునీల్ శెట్టికి చేదు అనుభవం
తాజాగా సునీల్ శెట్టి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా లాంటి పెద్ద దేశంలో తనకు అలాంటి పరిస్థితి ఎలా వచ్చిందో వివరించారు. 9/11 దాడుల తర్వాత అమెరికాలో తనకు ఈ షాకింగ్ ఘటన ఎదురైందని ఆయన చెప్పుకొచ్చారు. ‘కాంటే’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు సునీల్ శెట్టిని పోలీసులు పట్టుకుని, చేతులకు సంకెళ్లు కూడా వేశారట. ఈ ఘటన గురించి సునీల్ శెట్టి మాట్లాడుతూ “9/11 సంఘటన జరిగినప్పుడు మేము అప్పుడే లాస్ ఏంజిల్స్ కి చేరుకున్నాము. నేను వార్తలు చూస్తూనే ఉన్నాను. అయితే అసలు ఏం జరిగిందన్న విషయాన్ని న్యూస్ చూసాక కూడా నేను నమ్మలేకపోయాను. ఆ భయంకరమైన దాడి తర్వాత అమెరికాలో భద్రత పెరిగింది. ముఖ్యంగా గడ్డాలు, మరికొన్ని లక్షణాలు ఉన్న వ్యక్తుల పట్ల నిఘా పెరిగింది” అంటూ అప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితులను వివరాయించారు.
రూమ్ కీస్ అడిగినందుకే ఇంత హంగామానా ?
సునీల్ శెట్టి ఇంకా మాట్లాడుతూ “షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు నేను ఒక హోటల్లో బస చేశాను. ఆ హోటల్లో నడుస్తూ లిఫ్ట్ ఎక్కాను. కానీ తీరా చూస్తే నా రూమ్ కీస్ మర్చిపోయాననే విషయం అర్థమైంది. లిఫ్ట్ లో మరో అమెరికన్ పెద్ద మనిషి ఉండడంతో అతన్ని మీ దగ్గర కీస్ ఉన్నాయా అని అడిగాను. నా కీస్ మర్చిపోయాను కాబట్టి అలా అడిగాను. అలాగే నా టీం ఇంకా బయటే ఉన్నారు. అయితే ఆ వ్యక్తి అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి, వెంటనే అక్కడ నుంచి త్వరత్వరగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను సృష్టించిన గందరగోళం అంతా కాదు. కొన్ని క్షణాల్లోనే పోలీసులు వచ్చారు.
వాళ్లు వెంటనే డౌన్ లేదంటే మిమ్మల్ని కాల్చేస్తాము అని అరిచారు. కానీ అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. వెంటనే నేను నా మోకాళ్ళపై కూర్చున్నాను. దీంతో పోలీసులు నా చేతులకు సంకెళ్లు వేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక పూర్తిగా గందరగోళంలో పడ్డాను. కానీ అదృష్టవశాత్తు చిత్ర నిర్మాణ బృందం అక్కడికి వచ్చి సహాయం చేశారు. హోటల్ మేనేజర్లలో ఒకరైన పాకిస్తానీ పెద్దమనిషి కూడా జోక్యం చేసుకొని, నేను ఒక నటుడిని అని పోలీసులకు వివరించారు. అప్పుడుగానీ పరిస్థితులు చక్కబడలేదు. మేనేజర్ వారితో నేను ఒక నటుడినని, షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశాక నన్ను వదిలి పెట్టారు” అంటూ అప్పట్లో తనకు ఎదురైన ఈ విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకొచ్చారు సునీల్ శెట్టి.