Delhi HC on Bank Accounts : సైబర్ నేరాలతో సహా ఇతర కొన్ని కేసుల్లో నిందితుల బ్యాంకు ఖాతాల్ని పోలీసులు, దర్యాప్తు సంస్థలు స్థభింపజేస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని దిల్లీ హైకోర్టు సూచించింది. ఇటీవల ఓ కేసులో భాగంగా రూ.200 అనునుమానాస్పద లావాదేవీని గుర్తించిన పోలీసులు పూర్తిగా బ్యాంకు ఖాతాలను నిలుపుదల చేశారు. ఈ ఖాతాలో రూ.94 కోట్ల మేర నిధులు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.200 కోసం పూర్తి ఖాతాను నిలిపివేయడంతో.. వ్యాపార సంస్థలు తీవ్రంగా ఇబ్బందిపడుతుంటాయని ఆందోళన వ్యక్తం చేసిన దిల్లీ హై కోర్టు.. దర్యాప్తు సంస్థలు మరికాస్త జాగురుకతతో వ్యవహరించాలని సూచించింది.
ఇటీవల ఓ లాజిస్టిక్ సంస్థకు చెందిన ఖాతాలో అనుమానాస్పదంగా రూ.200 క్రెడిట్ అయినట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థలు.. ఆ సంస్థ అన్ని బ్యాంక్ ఖాతాలను నిలిపివేశాయి. ఆ సమయానికి ఆ సంస్థ దగ్గర రూ.94 కోట్ల కంటే ఎక్కువ నిధులు ఉన్నాయి. దర్యాప్తు సంస్థల చర్యలతో సంస్థ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయని దిల్లీ హైకోర్టును సంబంధింత లాజిస్టిక్ సంస్థ ఆశ్రయించింది. సైబర్ మోసం కేసులను దర్యాప్తు చేస్తున్నప్పుడు దర్యాప్తు సంస్థలు.. విచక్షణారహితంగా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై దిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అధికారం ఉందన్న కారణంగా పోలీసులు వ్యవహిస్తున్న విధానాలు సరైనవి కాదని వ్యాఖ్యానించింది. చిన్నచిన్న మొత్తాలకు పూర్తి ఖాతాలను నిలుపుదల చేయడంతో మరింత ఎక్కువ నష్టం వస్తుందని అభిప్రాయపడింది. ఇటువంటి ఘటనలు తరచుగా ఎదురవుతున్నాయని, దర్యాప్తు సంస్థల చర్యల కారణంగా అమాయక వ్యాపార సంస్థలు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లుగా గుర్తించినట్లు వెల్లడించింది.
సాధారణంగా సైబర్ నేరాల దర్యాప్తులో మోసగాళ్లు అక్రమంగా సంపాదించిన డబ్బును.. ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకుని వినియోగించుకునే అవకాశం లేకుండా చేసేందుకు పోలీసులు అనుమానాస్పద లావాదేవీలను ట్రాక్ చేస్తుంటారు. అలా ఏవైనా అసాధారణ లావాదేవీలు జరిగినప్పుడు.. ఆయా ఖాతాలను నిలిపివేస్తుంటారు. దీని ఫలితంగా నేరంలో ప్రమేయం లేకపోయినా చాలా మంది అమాయక వ్యక్తులు బాధపడుతుంటారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ జైన్.. అధికారాల్ని మరింత ఆలోచనాత్మకంగా అమలు చేయాలని సూచించారు.
ఇటువంటి కేసుల విషయంలో మరింత జాగ్రత్తగా, న్యాయంగా వ్యవహరించాలని.. ఇందు కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ స్టాండర్స్-(SOP) రూపొందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సూచించింది. చిన్న మొత్తాలకు సైతం ఇలాంటి ప్రభావంతమైన చర్యలు కాకుండా.. వివాదాస్పదమైన మొత్తాన్ని స్తంభింపజేయడం, లేదా ఆ మేరకు బ్యాంకు ఖాతా నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటే పరిశీలించాలని సూచించింది. ఇలాంటి కేసులు కోర్టు ముందు తరచుగా కనిపిస్తున్నాయని తెలిపిన ధర్మాసనం.. ఇటీవలి ఓ కేసులో.. పవన్ కుమార్ రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కేవలం రూ.105 సైబర్ మోసం ఆరోపణలపై బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన విషయాన్ని గుర్తు చేసింది.
దర్యాప్తు సంస్థల విచక్షణారహిత విధానాన్ని ప్రశ్నించిన కోర్టు.. పోలీసులకు అలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం ఉన్నప్పటికీ, వారు తమ చర్యలకు సమర్థన అందించగలగాలని అన్నది. కారణం లేకుండా ఖాతాలను స్తంభింపజేయడం ఖాతాదారుల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని, చిన్న విక్రేతలకు వారి జీవనోపాధికే ముప్పు కలిగిస్తుందని అభిప్రాయపడింది.