Superstar Krishna : మన హీరోలు సంవత్సరానికి ఒకట్రెండు సినిమాలు చేస్తే గొప్ప విషయమే. అలాంటిది 350కి పైగా సినిమాలు చేయటమంటే మామూలు విషయం కాదు.. అదొక చరిత్ర. అలాంటి చరిత్రను సృష్టించిన వ్యక్తి సూపర్‌స్టార్ కృష్ణ. అనారోగ్య సమస్యలతో ఆయన మంగళవారం తెల్లవారు జామున కన్నుమూసిన సంగతి తెలసిందే.కృష్ణ మృతితో యావత్ సినీ పరిశ్రమ మూగబోయింది. నటుడు, నిర్మాత, దర్శకుడిగా కృష్ణ చేసిన సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ కాదు. సినీ ఇండస్ట్రీ ఎదుగులకు ఆయన చేసిన సేవలు గణనీయమైనవి. అలాంటి మహోన్నత వ్యక్తి మృతికి సంతాప సూచకంగా బుధవారం రోజున షూటింగ్స్ చేయకూడదంటూ సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రకటనను తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు బుధవారం అంటే నవంబర్ 16న షూటింగ్స్‌ను బంద్ చేస్తున్నారు.
కృష్ణ పార్థివ దేహాన్ని ఇప్పుడు నానక్ రామ్ గూడ నుంచి పద్మాలయా స్టూడియోకి తరలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్య క్రియలు జరగనున్నాయి. సినీ సెలబ్రిటీలు, అభిమానులు, సన్నిహితులు మహేష్ సహా ఇతర కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.