Ranveer Allahbadia : ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (India’s Got Latent) అనే స్టాండప్ కామెడీ షోలో తల్లిదండ్రులపై అసభ్యకరమైన కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు యూట్యూబ్ రణవీర్ అలహాబాదియా (Ranveer Allahbadia). తాజాగా సుప్రీం కోర్టు అతనికి ఈ వివాదంలో కొంతమేర రిలీఫ్ ని ఇచ్చింది. కానీ ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు అతనికి కోర్టు గట్టిగానే చీవాట్లు పెట్టింది.
రణవీర్ తీరుపై కోర్టు ఫైర్
‘బైసెప్స్ గై’ అనే పేరుతో పాపులర్ అయిన యూట్యూబర్ రణవీర్ అలహబాదియా. తాజాగా ‘ఇండియాస్ గాట్ లాటెండ్’ షోలో అతను చేసిన అనుచిత వ్యాఖ్యలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్రంగా ఖండించారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఏకీకృతం చేయాలని కోరుతూ అల్లాబాడియా తన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ ద్వారా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఈ కేసు విచారణకు రాగా, న్యాయమూర్తులు అతని వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా “ఇలాంటి ప్రవర్తనను ఖండించాల్సిందే. మీకు పాపులారిటీ ఉన్నంత మాత్రాన సమాజాన్ని తేలికగా ఎలా తీసుకుంటారు? ఇలాంటి భాషను ఇష్టపడే వారు ఎవరైనా భూమ్మీద ఉంటారా అసలు? అతని మనసులో చెడు భావన ఉండడం వల్లే, అవి షో ద్వారా బయట పడ్డాయి. ఇలాంటి వ్యక్తిని మేము ఎందుకు రక్షించాలి?” అని సుప్రీం కోర్టు తీవ్రంగా మండిపడ్డట్టు సమాచారం. అంతేకాకుండా ఇకపై రణవీర్ కు సంబంధించిన యూట్యూబ్ షోలను ప్రసారం చేయకుండా సుప్రీం కోర్టు బ్యాన్ చేసింది.
ఈ వ్యాఖ్యలు అతడి వికృత మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని జస్టిస్ కాంత్ ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ “మీరు మాట్లాడిన పదాలతో మీ తల్లిదండ్రులు సైతం సిగ్గుపడతారు. అక్కా చెల్లెళ్ళు, సమాజం మొత్తం తలదించుకుంటుంది” అని ఫైర్ అయినట్టు తెలుస్తోంది.
పాస్ పోర్ట్ స్వాధీనం
ఇదిలా ఉండగా ఈ కేసులో రణవీర్ పై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అందులో ఒకటి అస్సాంలో, మరొకటి మహారాష్ట్రలో ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై సుప్రీంకోర్టు అతనికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ విషయంపై రణవీర్ పై మరిన్ని కేసులు నమోదు చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఇక రణవీర్ తన కుటుంబానికి డెత్ థ్రెట్స్ వచ్చాయని చెప్పుకోవడంతో, అలాంటి బెదిరింపులు ఏమైనా ఉంటే మహారాష్ట్ర లేదా అస్సాం పోలీసులను కూడా సంప్రదించవచ్చని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా దర్యాప్తుకు సహకరిస్తే మహారాష్ట్ర లేదా అస్సాం పోలీసులు అతన్ని అరెస్ట్ చేయరని, అయితే అతని పాస్ పోర్ట్ ను మహారాష్ట్రలోని థానేలో పోలీసుల దగ్గర డిపాజిట్ చేయాలని కోర్టు రణవీర్ ని ఆదేశించింది. అంతేకాకుండా ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళొద్దని అతన్ని హెచ్చరించింది కోర్టు. ఇదిలా ఉండగా, రణవీర్ ఓవైపు పోలీస్ కేసులు, మరోవైపు జాతీయ మహిళా కమిషన్ సమన్లు, ఇంకోవైపు పార్లమెంటరీ ప్యానెల్ నుంచి ప్రశ్నలు వంటి అనేక చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాడు.