Kollywood : ఇటీవల కాలంలో రివ్యూల వల్ల సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది అనే వాదన ఎక్కువగా విన్పిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకూ ఈ అభిప్రాయం బలపడుతోంది. ఇప్పటికే ఈ విషయంపై టాలీవుడ్ లో పలువురు నిర్మాతలు చేసిన కామెంట్స్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఓవైపు నిర్మాతలు రివ్యూల వల్ల సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది అని ఫైర్ అవుతుంటే, మరోవైపు రివ్యూవర్లు సినిమా బాగా తీస్తే అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? కంటెంట్ బాగున్నప్పుడు రివ్యూలు సినిమాలను ఎలా ఎఫెక్ట్స్ చేస్తాయి? అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమ రివ్యూల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
తమిళ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (Tamil Film Active Producers Association) తాజాగా యూట్యూబ్ ఛానల్స్ తో పాటు కొంతమంది నెటిజెన్లు ఇచ్చే రివ్యూలు సినిమా ఫలితంపై ప్రభావం చూపుతున్నాయని వెల్లడించింది. రోజు రోజుకూ పెద్ద సమస్యగా మారుతున్న దీన్ని నియంత్రించడానికి తాజాగా తమిళ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా బుధవారం రివ్యూల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటూ స్పెషల్ పోస్ట్ పెట్టింది.
ఆ పోస్టులో రివ్యూ ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలపై గట్టి ఎఫెక్ట్ చూపించాయి. ముఖ్యంగా కంగువా (Kanguva), ఇండియన్ 2 (Indian 2), వేట్టయన్ (Vettaiyan) సినిమా రిజల్ట్ పై పబ్లిక్ టాక్ తో పాటు యూట్యూబ్ ఛానల్ ఇచ్చే విశ్లేషణలు స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ చూపించాయి. చిత్ర పరిశ్రమకు రానురానూ ఇదొక సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి సినీ పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలి అంటూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా పరిశ్రమ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని, అందులో భాగంగా థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానల్స్ ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు అంటూ రివ్యూవర్లకు షాక్ ఇచ్చే కామెంట్స్ చేశారు.
మొదటి రోజు, మొదటి షో సమయంలో థియేటర్ల వద్ద పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదు అని డిసైడ్ చేసిన తమిళ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (Tamil Film Active Producers Association) రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇకపై అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ సినిమాకు మొదటి షో నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అలాగే అందులో నటించిన నటీనటులతో పాటు దర్శకులను కూడా విమర్శించారు. మరోవైపు ‘కంగువ’ (Kanguva) విషయంలో కూడా సూర్య యాక్టింగ్ బాగుందని అన్నప్పటికీ, సినిమాను మాత్రం తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మరి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది ఇప్పుడు ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా మారింది.