Thaman: మామూలుగా తెర వెనుక డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేసేవారు తెరపై కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఒక సినిమాకు కావాల్సిన వర్క్ చేసి అలాగే సైలెంట్ అయిపోతుంటారు. అందులో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే చాలామంది తమన్ అనే అంటారు. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు, తమన్‌కు గట్టి పోటీ జరిగినా ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్నీ తమన్ చేతిలోనే ఉన్నాయి. అలా సంగీత దర్శకుడిగా రెండు చేతులా బిజీగా ఉన్న తమన్.. తెరపై కూడా కనిపించడానికి సిద్ధమవుతున్నాడని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇన్నేళ్ల తర్వాత
అసలైతే తమన్.. ఒక సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు. ముందుగా తను ఒక నటుడిగానే ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ముందుగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాయ్స్’ అనే సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడిగా నటించాడు. అసలైతే ఇందులో హీరో సిద్ధార్థ్ అయినా తన ఫ్రెండ్స్‌గా నటించిన మిగతా ముగ్గురికి కూడా సమానంగా ప్రాధాన్యత అందించాడు శంకర్. అలా నటుడిగా తమన్ డెబ్యూ చాలా గ్రాండ్‌గా జరిగింది. 2003లో ఈ మూవీ విడుదలయ్యింది. దాని తర్వాత తమన్ ఎప్పుడూ యాక్టింగ్ జోలికి వెళ్లలేదు. సంగీత దర్శకుడిగానే బిజీ అయ్యాడు. కానీ ఇన్నాళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకులు.. తమన్‌ను ఒక నటుడిగా చూడనున్నారని సమాచారం.
ఫ్రెండ్ క్యారెక్టర్
కోలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడైన అథర్వ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో తమన్ ఒక కీలక పాత్ర నటిస్తున్నట్టుగా వార్తలు మొదలయ్యాయి. ‘బాయ్స్’లో లాగానే ఇందులో కూడా హీరో ఫ్రెండ్ పాత్రలోనే తమన్ కనిపించనున్నాడని తెలుస్తోంది. ‘బాయ్స్’లో నటించింది తమనే అని గ్రహించిన తర్వాత చాలామంది ప్రేక్షకులు తమన్‌లో మంచి నటుడు ఉన్నాడని గుర్తించి తను వెండితెరపై మళ్లీ రీఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని చర్చించుకుంటూ ఉన్నారు. ఫైనల్‌గా తమన్‌ను మరోసారి వెండితెరపై చూడాలనే ఫ్యాన్స్ కోరిక త్వరలోనే నిజం కానుందని తెలుస్తోంది. కానీ మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస కమిట్మెంట్స్ మధ్య అసలు తమన్ (Thaman) ఈ ఆఫర్ ఒప్పుకుంటాడా అని అందరిలో అనుమానాలు కూడా మొదలయ్యాయి.
Also Read: ఉదయం లేవగానే అలాంటి పని.. ఇండస్ట్రీలో ఒక్క బాలకృష్ణకే సాధ్యం..!
గెస్ట్ రోల్స్
నటుడిగా కాకపోయినా అప్పుడప్పుడు సినిమాల్లో తను పాడిన పాటల్లో క్యామియో ఇస్తూనే ఉన్నాడు తమన్. చివరిగా హిందీ మూవీ అయిన ‘బేబి జాన్’లో కనిపించాడు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా అట్లీ నిర్మించిన చిత్రమే ‘బేబి జాన్’. ఈ సినిమాకు సౌత్ ఫ్లేవర్‌ను యాడ్ చేయడం కోసం తమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు మేకర్స్. ముందుగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ‘నైన్ మటక్కా’ అనే పాటను విడుదల చేశారు. ఆ పాటలో తమన్ మెరుపు తీగలా ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడు. ఇక ఇలాంటి క్యామియో కాకుండా పూర్తిగా తమన్ పైనే ఫోకస్ అయ్యి ఉన్న పాత్రను, సినిమాను చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు.