They Call Him OG : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన డైరెక్టర్లు సుజిత్ ఒకడు. చాలా చిన్న ఏజ్ లోనే షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టి, రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి సుజిత్ చేసిన చాలా సినిమాలను ప్రభాస్ చూశాడు. ప్రభాస్ చూసిన తర్వాత ఈ అబ్బాయిని పిలిపించండి అని యూవి క్రియేషన్స్ లో చెప్పడంతో సుజిత్ కి రన్ రాజా రన్ సినిమా అవకాశం వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. దర్శకుడుగా సుజిత్ కు మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వం వహించిన సినిమా సాహో. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగులో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
పవన్ కళ్యాణ్ తో ఛాన్స్
సుజిత్ సాహో సినిమా అయిపోయిన తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ సుజిత్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన కూడా దర్శకుడుగా ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు అనే పేరును మాత్రం సంపాదించుకున్నాడు. బాహుబలి వంటి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. అలానే పవన్ కళ్యాణ్ తో ఒక రీమేక్ సినిమా చర్చల గురించి వెళ్ళాడు సుజిత్. ఆ తరుణంలో ఇంకో కథ ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఈ గ్యాంగ్ స్టార్ స్టోరీని తెలిపాడు. వెంటనే ఈ సినిమా కథ నచ్చడంతో దీనిని పట్టాలెక్కించారు పవన్ కళ్యాణ్.
అనుకున్నచోట అవ్వలేదు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న అన్ని సినిమాల కంటే ఎక్కువ అంచనాలు ఉన్న సినిమా ఓ జి. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన హంగ్రీ చీతా అనే వీడియో కూడా విపరీతమైన కిక్ ఇచ్చింది. అంచనాలను అమాంతం పెంచేస్తుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ కు సరిపడా సినిమా కదా ఇది అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ థాయిలాండ్ లో తీయాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న రాజకీయ పరిస్థితుల వలన దీనిని ఇప్పుడు తాడేపల్లిగూడెంలో సెట్స్ వేసి మరి తీస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇది అయిన వెంటనే మే 14 నుంచి ఓజీ షూటింగ్ లో పాల్గొననున్నాడు పవన్ కళ్యాణ్.
Also Read : Suriya : ఆ కథకు నేను సరిపోను, నేను ఈ సినిమాను స్పాయిల్ చెయ్యను