Tiger: ఓ సీరియల్ సెట్లో నిన్న రాత్రి(6 మార్చీ) ఒక చిరుతపులి(leopard) దర్శనమిచ్చింది. చిరుతపులి సెట్లో ప్రవేశించిన సమయంలో అక్కడ తక్కువ మంది మాత్రమే ఉండటంతో ప్రమాదం తప్పింది. రాత్రి 9 గంటల షిఫ్ట్ ముగిసిన తరువాత, అక్కడ ప్రొడక్షన్ యూనిట్ లోని కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో వారు తలా ఓ చోటికి వెళ్లి పోయినట్టు సమాచారం. చిరుతపులి కోతులను వేటాడేందుకు సెట్లోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలో ఫిల్మ్ సిటీ ఉండటంతో, అక్కడ తరచుగా చిరుతలు, కోతులు, జింకలు, పాములు కనిపించడం సహజం. ఫిల్మ్ సిటీలోని సీరియల్ సెట్లలో ప్రొడక్షన్ యూనిట్ కోసం ఆహారం సిద్ధం చేస్తారు. ఆహారం వాసనకు ఆకర్షితమైన కోతులు, కుక్కలు ఎక్కువగా అక్కడ గుమిగూడుతాయి. వాటిని వేటాడేందుకు చిరుతలు అప్పుడప్పుడు సెట్లలోకి వస్తుంటాయి.
సాధారణంగా, సెట్స్‌కి పూర్తిగా పైకప్పు ఉండకపోవడంతో, కొన్ని చోట్ల ఇనుప రాడ్లు అమర్చుతారు. వీటి సహాయంతో లైటింగ్ పనులు సులభమవుతాయి. ఆపై తాటి ఆకులు, ప్లాస్టిక్ షీట్‌లు వంటివి ఈ రాడ్లపై కప్పి సెట్స్‌ను మూసేస్తారు. అయితే, పూర్తి రక్షణ లేకపోవడం వల్ల, చిరుతలు ఇనుప రాడ్లను ఎక్కి సులభంగా సెట్లోకి ప్రవేశిస్తాయి.
ఇప్పటి వరకు ఏ సెట్‌లోనూ చిరుతపులి దాడి చేసిన వార్తలు రాలేదు. ‘పాకెట్ మెయిన్ ఆస్మాన్’ సెట్లో కూడా, చిరుత ఇనుప రాడ్లను అధిగమించి లోపలికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. ఇక్కడ కూడా ఎవ్వరికి ఏ హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.