Actor Suhas Movie ‘Prasanna Vadanam’ Review: నటుడు సుహాస్ కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రం ‘కలర్ ఫోటో’. ఈ మూవీ హిట్‌తో సుహాస్ క్రేజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ సినిమాలతో వచ్చి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. సహజత్వంతో కూడిన ప్రేమకథలతో కథానాయకుడిగా మంచి హిట్లను సుహాస్ అందుకుంటున్నాడు. అయితే ఈ సారి కొత్తగా ట్రై చేశాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీనే ‘ప్రసన్నవదనం’. ఈ మూవీ ఈ రోజు (మే 3)న రిలీజ్ అయింది. దర్శకుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ‘ప్రసన్నవదనం’ మూవీలో రాశీసింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో.. ఈ సినిమాతో సుహాస్ మరో హిట్టు కొట్టాడా లేదా అనేది ఇప్పుడు ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సూర్య (సుహాస్) ఓ FM రేడియో స్టేషన్‌లో ఆర్జేగా చేస్తుంటాడు. అయితే ఓ రోజు అతడికి యాక్సిడెంట్ అవుతుంది. దీని కారణంగా అతడి తలకి గట్టిగా దెబ్బ తగులుతుంది. దీంతో అతడికి ఫేస్ బ్లైండ్‌నెస్ డిజార్డర్ వస్తుంది. ఎవరి ఫేస్‌ను కానీ, వాయిస్‌ను కానీ గుర్తు పట్టలేడు. ఆ సమస్యను ఎదుటివారికి తెలియకుండా మ్యానేజ్ చేస్తుంటాడు. అయితే ఓ రోజు అమృత (సాయి శ్వేతా) అనే అమ్మాయిని సూర్య కళ్లముందే లారీ కింద తోసేసి కొందరు దుండగులు చంపేస్తారు.
సూర్యకు డిజార్డర్ ఉండటం వల్ల హంతకులను గుర్తించలేడు. అయితే ఆ హత్య గురించి వెళ్లి సూర్య పోలీసులతో చెబుతాడు. దీంతో ఆ హత్య కేసును ఛేదించేందుకు ఏసీపీ వైదేహి (రాశిసింగ్), ఎస్ఐ (నితిన్ ప్రసన్న) రంగం లోకి దిగుతారు. దీంతో ఈ కేసులోని నిజాలను వారు ఎలా బయటకు తీశారు. అయితే ఇదే కేసులో సూర్య నిందితుడిగా ఎలా మారాడు?.. ఫేస్ బ్లైండ్‌నెస్ కారణంగా అతడు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. అసలు అమృత అనే అమ్మాయిని ఎందుకు చంపారు?.. ఆద్య (పాయల్ రాధాకృష్ణ)ని ప్రేమించిన సూర్య తన సమస్యను ఆమెకు చెప్పాడా? లేదా అనేది తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే.
Also Read: మైత్రీ చేతికి ప్రసన్నవదనం.. మరో హిట్ కొట్టబోతున్నహీరో సుహాస్!
హీరో సూర్యతో పాటు అతడి ఫ్యామిలీ యాక్సిడెంట్‌కు గురయ్యే సన్నివేశంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే ప్రమాదంలో సూర్య తలకి బాగా దెబ్బ తగిలి.. అది ఫేస్ బ్లైండ్ నెస్‌కి దారితీస్తుంది. దాన్ని ఇతరులకు తెలియకుండా సూర్య మ్యానేజ్ చేసే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. అంతేకాకుండా ప్రియురాలు ఆద్యకు ఈ విషయం తెలియకుండా సూర్య తన ఫ్రెండ్ సహాయంతో వేసే ప్లాన్లు అందరినీ ఆకట్టుకుంటాయి.
ఇక ఒక్కసారిగా లవ్, కామెడీ సన్నివేశాలతో ముందుకు సాగుతున్న ఈ సినిమా ఒక్కసారిగా హత్య జరగడంతో క్రైమ్ థ్రిల్లర్ వైపుగా వెళుతుంది. ఇక ఇంటెర్వెల్ ట్విస్ట్‌తో ఆడియన్స్ చాలా బాగా సర్ప్రైజ్ అవుతారు. అయితే ఇక్కడ కొన్ని చోట్ల వేగం మిస్సయింది. ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఎక్కువగా ఉండే వేగం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అదే ఈ మూవీలో కాస్త తగ్గింది.
Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో దిల్‌రాజు మరో మూవీ.. టైటిల్ ఇదే..!
ఇక యాక్టింగ్ విషయానికొస్తే.. ఫేస్ బ్లైండ్ నెస్ డిజార్డర్‌తో ఇబ్బందిపడే సూర్యగా సుహాస్ చాలా నాచురల్‌గా నటించి మెప్పించాడు. ఇందులో కొత్త దనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక పోలీస్ ఆఫీసర్‌గా రాశీసింగ్ యాక్టింగ్ ఇరగదీసేసింది. హీరో ప్రేయసిగా పాయల్ రాధాకృష్ణ, ఫ్రెండ్‌గా వైవా హర్ష బాగా నవ్వించారు. మొత్తంగా సస్పెన్స్ జోనర్‌ను బాగా ఇష్టపడేవారికి ఇది చాలా బాగా నచ్చుతుంది.