Tollywood :ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదల కి ఒకరోజు ముందే కొన్నిచోట్ల ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ తన కుటుంబంతోపాటు సినిమా చూడటానికి వచ్చాడు. అల్లు అర్జున్ రావడంతో సినిమా టికెట్ కొనుక్కున్న ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలామంది అభిమానులు కూడా థియేటర్ కు వచ్చేసారు. అంతమంది ఒకేసారి రావడంతో అక్కడ ఊహించిన విధంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. తన బిడ్డ శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆ కుటుంబానికి పాతిక లక్షల రూపాయలను ఇస్తున్నట్లు, అలానే వైద్యానికి సంబంధించిన ఖర్చులను తాను భరిస్తాను అని చెబుతూ ఒక వీడియో కూడా విడుదల చేశాడు.
అంతా సద్దుమణిగిపోయింది అనుకునే టైంలో అల్లు అర్జున్ ను ఈ కేసు విషయంలో చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. దాదాపు 14 రోజులు పాటు అల్లు అర్జున్ జైల్లో ఉంటాడు అని చాలా కథనాలు కూడా వినిపించాయి. అయితే అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ లభించడం వలన, కేవలం ఒక్కరోజులో జైలు నుంచి బయటకు వచ్చేసాడు. అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రాగానే చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ అంతా తనను ఒకరి తర్వాత ఒకరు కలవడం అల్లు అర్జున్ కి సంబంధించిన పి ఆర్ టీం దీని అంతటిని లైవ్ టెలికాస్ట్ చేశారు. అయితే ఇది అల్లు అర్జున్ కు తీవ్రమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. ఇకపోతే తెలంగాణ అసెంబ్లీలో కూడా ఈ వివాదానికి సంబంధించిన చర్చ తీవ్రంగా జరిగింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తర్వాత ఈ కేస్ ఎంత సీరియస్ అవ్వబోతుందో అని అందరికీ ఒక అవగాహన వచ్చేసింది.
ఇక ఈ కేసు విషయమై మాట్లాడటానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, దిల్ రాజు వీళ్ళు అంతా కూడా రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని వీళ్ళు అందరూ కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి అలానే ముఖ్యంగా ఈ ఘటన గురించి మాట్లాడబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. గతంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ వ్యక్తులు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో కూడా ఇలాంటి చర్చలు జరిపారు. అయితే ఆ చర్చల కంటే కూడా ఇప్పుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇష్యూ మేజర్ టాపిక్ అని అందరికీ ఒక అవగాహన ఉంది. అయితే దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అని రేపు తెలియనుంది.
Also Read : Garividi Lakshmi: తెరపైకి మరో కళాకారిని బయోపిక్