Delhi CM Atishi arrest : దిల్లీలో జాతీయ పార్టీల అధిపత్యానికి ఎదురు నిలిచి వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన ఆప్.. మరోసారి అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహారంపై కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ కేసులో తనని అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.. త్వరలోనే దిల్లీ సీఎం అతిశీని అరెస్ట్ చేస్తారంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కేజ్రీవాల్.. బీజేపీ పై విమర్శలు చేశారు.
దిల్లీ ప్రజల కోసం ఆప్ ప్రభుత్వం అనేక పథకాల్ని కొనసాగిస్తోంది. ఇవే తమను తదుపరి ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఈ పథకాలను అడ్డుపెట్టుకునే తమ పార్టీ నేతల్ని అరెస్ట్ చేస్తారంటూ కేజ్రీవాల్ చెబుతున్నారు. ఆయా పథకాల ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటున్నా.. బీజేపీ నాయకులకు ఎలాంటి ప్రయోజం లేకుండా పోయిందని కేజ్రీవాల్ అంటున్నారు. పైగా..ఎన్నికల్లో ఆప్ గెలుపునకు, బీజేపీ ఓటమికి ఆయా పథకాలే కారణమవుతాయని.. అందుకే వాటిలో అవినీతి జరిగిందంటూ సీఎం అతిశీని అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలోకి దిగిన కేజ్రీవాల్ పార్టీ.. ఇప్పటికే దిల్లీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇక ఇప్పుడు ప్రజలకు వివిధ హామీలను ఇస్తోంది. అందులో భాగంగా.. ఈ సారి ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం వస్తే అర్హులైన మహిళలకు మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ప్రతినెల రూ.2,100 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే.. సంజీవనీ యోజన పథకం ద్వారా రాష్ట్రంలోని వయో వృద్ధులు అందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు.. ప్రస్తుతం దిల్లీలో ఆప్ ప్రభుత్వమే ఉండడంతో.. అర్హుల్ని నిర్ధరించేందుకు దరఖాస్తుల స్వీకరణ సైతం ప్రారంభమైంది.
ఈ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్.. ఇప్పుడు ఈ పథకాలనే కారణంగా చూపి ఏకంగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ తీసుకొచ్చిన ఈ పథకాలు కొందరికి నచ్చలేదని.. అందుకే తమ నాయకులపై త్వరలోనే తప్పుడు కేసు నమోదు చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఆ కేసులో దిల్లీ సీఎం అతిశీని ఆరెస్టు చేస్తారని అన్నారు. అంతకంటే ముందు ఆప్ సీనియర్ నాయకుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తారు అంటూ పోస్ట్ చేశారు.
ఆప్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాలకు సంబంధించిన దిల్లీ వార్తా పత్రికల్లో ఓ ప్రకటన వెలువడింది. ఇందులో.. మహిళా సమ్మాన్ యోజన కింద దిల్లీలోని మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామనే ప్రకటనను ఖండించింది. ఇలాంటి పథకం గురించి ఓ పార్టీ ప్రచారం చేస్తున్నట్లు తమ వద్దకు వచ్చిందన్న దిల్లీ మహిళా, శిశు అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు… ప్రస్తుతానికి తమ వద్ద అలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవని తెలిపింది. దిల్లీ ప్రభుత్వం.. ఈ పథకాల గురించి నిర్ణయం తీసుకోలేదన్న సదరు ప్రకటన.. రాష్ట్రంలోని వృద్ధుల సమాచారం సేకరించే అధికారం ఎవరీ లేదంటూ వార్తా పత్రికల్లో ప్రకటన వెలువడింది. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని అధికారుల్ని బీజేపీ బెదిరించిందంటూ.. ఆప్ ఆరోపిస్తోంది. వారి ద్వారానే ఇలాంటి ప్రకటనలు ఇప్పిస్తోందని అంటోంది.
ఈ ప్రకటనపై దిల్లీ ముఖ్యమంత్రి అతిశీ సైతం స్పందించారు. ప్రభుత్వ నేతలు ప్రకటించిన పథకాలన్ని తప్పుడు పథకాలంటూ ప్రభుత్వ శాఖలే ప్రకటనలు విడుదల చేయడంపై ఆగ్రహించారు. ఈ ప్రకటనలు విడుదలకు ఆదేశాలిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అలాగే.. ఇటీవల సీబీఐ, ఈడీ అధికారుల సమావేశం జరిగిందని, అందులో.. సీఎంను తప్పుడు కేసులో అరెస్టు చేయాలనే ఆలోచన చేశారనే సమాచారం తమ వద్ద ఉందని అతిశీ వ్యాఖ్యానించారు.
Also Read : కజకిస్తాన్ లో విమాన ప్రమాదం.. 70 మంది దుర్మరణం!
తనపై తప్పుడు కేసు నమోదు చేసినా భయపడనని ప్రకటించిన దిల్లీ ముఖ్యమంత్రి అతిశీ.. తనకు దేశ న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ఒకవేళ అరెస్ట్ చేసినా నాకు బెయిల్ వస్తుందని అన్నారు. ఏదిఏమైనా.. దిల్లీలో మరోమారు ఆప్ ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు.