Tollywood:..ఈమధ్య కాలంలో సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి అంటూ హీరోలు, ఇటు చిత్ర బృందం ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ప్రమోషన్స్ లో భాగంగా కొత్త స్ట్రాటజీతో సరికొత్త ట్రెండు సృష్టిస్తున్నారు యంగ్ హీరోలు. “తమ సినిమా చూడకపోయినా పర్లేదు ఈ సినిమా చూడండి”అని ఒక హీరో తన స్ట్రాటజీ ఉపయోగిస్తే.. ఇంకొక హీరోనేమో ‘మీ లవర్ తో పాటు మాజీ లవర్ తో కూడా సినిమాకి రండి” అంటూ పిలుపునిస్తున్నాడు. ఇంకొక హీరో “సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్ చేస్తానంటూ” చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు తమ స్ట్రాటజీని ఉపయోగించి, ప్రమోషన్స్ లో సరికొత్త ట్రెండు క్రియేట్ చేస్తున్నారు. ఏది ఏం చేసినా ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించడమే అసలు లక్ష్యం. మరి ఏ హీరో ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు చూద్దాం..
అందరి లక్ష్యం ఒకటే..
వాస్తవానికి సినిమాలు ఎవరైనా తీస్తారు.. కానీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, రెండున్నర గంట పాటు థియేటర్లలో కూర్చోబెట్టిన వారే అసలైన సక్సెస్ కొట్టినట్టు. ఒకప్పుడు వాల్ పోస్టర్లు అంటిస్తే చాలు.. వాటిని చూసి జనాలు థియేటర్లకు వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనాలకు ఏదైనా కొత్తగా అనిపిస్తేనే థియేటర్కు వస్తున్నారు. అందుకే ప్రేక్షకుడు సినిమా థియేటర్కు రావాలి అంటే క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. కావాల్సినంత పబ్లిసిటీ పెంచాలి. అప్పుడు కానీ ప్రేక్షకులు థియేటర్ల వైపు కదలడం లేదు. ఈ నేపథ్యంలోనే హీరోలు కూడా వెరైటీ ప్రమోషన్స్ బాట పట్టారు.
ఈ సినిమా నచ్చకపోతే నా సినిమా చూడొద్దు – నాని..
ఇటీవల నాని ఒక మైండ్ గేమ్ అప్లై చేసిన విషయం అందరికీ తెలిసిందే. తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ‘కోర్ట్’ అనే సినిమా తీశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని ప్రమోషన్స్ కోసం కొత్త దారి ఎంచుకున్నాడు. ముఖ్యంగా కోర్ట్ కథ అందరూ చూడాల్సిన సినిమాని, ఈ సినిమా నచ్చకపోతే తన నెక్స్ట్ సినిమా ‘హిట్ 3’ చూడకపోయినా పర్వాలేదు అంటూ తెలిపారు. ఇకపోతే సినిమా బాగుంటే నాని చెప్పినా చెప్పకపోయినా మౌత్ టాక్ తో జనాలు థియేటర్లకు క్యూ కడతారు. ఈ విషయం నానికి కూడా తెలియంది కాదు.. బలమైన ఓపెనింగ్ తీసుకురావడమే లక్ష్యంగా నాని ఇలాంటి కామెంట్లు చేశారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ టీంను ఫాలో అవుతున్న ‘రాబిన్ హుడ్’..
ఇకపోతే ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీం చేసిన ఫన్నీ స్కిట్స్ సినిమా సక్సెస్ కి ఎంత బూస్ట్ ఇచ్చాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను నితిన్ (Nithin) ‘రాబిన్ హుడ్’ టీం ఫాలో అవుతోంది. దర్శకుడు వెంకీ కుడుముల (Venky kudumula) తో చేసిన ఫన్నీ వీడియోను నితిన్ షేర్ చేశాడు. నితిన్ వెంటపడుతూ ప్రమోషన్ స్టార్ట్ చేద్దామా అంటూ వెంకీ కుడుముల చేసిన కామెంట్లకు టార్చర్ భరించలేక సరే ప్రమోషన్ మొదలు పెడదాం అంటాడు నితిన్. మొత్తానికైతే సినిమా ప్రమోషన్స్ మరింత స్పీడ్ గా చేయబోతున్నట్లు తెలిపారు. మార్చ్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
లవర్ తో పాటు మాజీ లవర్ ని కూడా పిలుచుకు రండి అంటున్న కిరణ్..
ఇప్పుడు కిరణ్ సరికొత్త స్ట్రాటజీ అప్లై చేశాడు. మార్చి 14వ తేదీన తాను నటించిన ‘దిల్ రూబా’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో..” మీ లవర్ తో పాటు మీ ఎక్స్ తో కూడా కలిసి రండి” అంటూ తెలిపాడు. మొత్తానికైతే యూత్లో మైలేజ్ పెంచడానికి కిరణ్ కూడా కొత్త స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. అంతేకాదు స్టోరీ ముందే గెస్ చేస్తే సినిమాలో తాను వాడిన బైక్ గెలుచుకోవచ్చు అనే కాంటెస్ట్ కూడా పెట్టారు. మరి ఇంతమంది హీరోల స్ట్రాటజీలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.