Jagga Reddy : సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ వచ్చిన తర్వాత నటినటుల దృష్టి రాజకీయాలపై పడుతుంది. ఎన్టీఆర్ (NTR) నుంచి మొదలు పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరకు చాలామంది స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు, సక్సెస్ అయ్యి చూపించారు. అయితే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవారు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అన్నది మాత్రం చాలా అరుదు. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్టుగా ప్రకటించి, తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
టాలీవుడ్ లోకి జగ్గారెడ్డి ఎంట్రీ
తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన జగ్గా రెడ్డి త్వరలోనే ఓ ప్రేమ కథా చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనన్నట్టు ఆఫ్ ది రికార్డ్ వెల్లడించారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. నిజ జీవిత పాత్రని ఆయన ఈ సినిమాలో పోషించబోతుండడం మరో విషయం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. అయితే ఈ ఉగాదికి మూవీకి సంబంధించిన కథను వింటానని, వచ్చే ఉగాదికి ఈ మూవీని రిలీజ్ చేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.
మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీని ‘జగ్గారెడ్డి’ అనే పేరుతోనే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ‘వార్ ఆఫ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. దీనికి వడ్డి రామానుజం దర్శకత్వం వహించారు. ఇప్పటకే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయగా, అందులో ఓ ప్రేమ జంట, సీరియస్ లుక్ లో జగ్గా రెడ్డి కన్పిస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నట్టు అన్పిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించే ఛాన్స్ ఉంది. మరి తెలంగాణ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన జగ్గారెడ్డి నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
రాజకీయాల నుంచి సినిమాల్లోకి యూటర్న్…
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా జగ్గా రెడ్డి ఓటమి కాంగ్రెస్ నాయకులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా, ఫైర్ బ్రాండ్ గా పేరు మోసారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు అంటే 2004, 2014, 2018లలో సంగారెడ్డి నుంచి గెలిచి, తన హవా కొనసాగించారు. కాంగ్రెస్ కు ఎదురుగాలి వీస్తున్న టైం లోనే సత్తా చూపించిన జగ్గా రెడ్డి, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆశ్చర్యకరంగా ఓడిపోయారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన టాలీవుడ్ వైపు దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. పైగా ఈ సినిమాకు ‘జగ్గారెడ్డి’ అని టైటిల్ ని పెట్టడం, ఇందులో ఆయన రియల్ లైఫ్ రోల్ పోషిస్తున్నానని చెప్పడంతో మూవీ లవర్స్ కి సినిమాపై ఇప్పటి నుంచే క్యూరియాసిటీ మొదలైంది. ఇక జగ్గా రెడ్డి అభిమానులకు, అనుచరులకు ఇదొక శుభవార్త.