Sr.NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR) జయంతి కావడంతో ఈరోజు ఉదయాన్నే ఆయన మనవళ్ళు , హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram).. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని తమ తాతగారికి పువ్వులతో నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడికి నారా నందమూరి కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరి చేరుకొని ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పిస్తున్నారు .ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తరాలు గుర్తుపెట్టుకునే గొప్ప నటులు..
స్వర్గీయ నందమూరి తారక రామారావు నేడు మన మధ్య లేకపోయినా ఆయనను తరాలు గుర్తుపెట్టుకుంటాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఒక సినిమా నటుడే కాదు గొప్ప రాజకీయ నేత కూడా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెసేతర పార్టీని స్థాపించడమే కాకుండా తన అద్భుతమైన ప్రోత్సాహంతో రాష్ట్రాన్ని సుభిక్షం వైపు అడుగులు వేయించారు. అంతేకాదు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ ఆ పథకాలతో ఎంతోమంది పేదవారి జీవితాలలో వెలుగులు నింపారు. ఇక ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఇప్పుడే కాదు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. ఆయన సినిమాల విషయానికి వస్తే.. ఏకంగా తెలుగు, తమిళ్, హిందీ, గుజరాతి భాషల్లో 303కి పైగా చిత్రాలలో నటించి ఆడియన్స్ హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకే ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ఆయనను తరాలు గుర్తుపెట్టుకుంటారని అందరూ చెబుతూ ఉంటారు.
ఆంధ్రుల అన్నగారు..
10వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేరు సొంతం చేసుకున్న సీనియర్ ఎన్టీఆర్ 1928 మే 28న జన్మించారు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రక వంటి చిత్రాలలో వైవిద్య భరితమైన పాత్రలు ఎన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ను ఆంధ్రులు ముద్దుగా “అన్నగారు”అని పిలుచుకుంటారు. ఇక ఈ పదం చెప్పగానే మనకు ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు అంతలా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. ఇకపోతే తాత పరంపరను కొనసాగించడానికి ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్న విషయం విధితమే.