Hansika Motwani : మిల్కీ బ్యూటీ హన్సిక మోత్వాని (Hansika Motwani) ఓవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు బుల్లితెర షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు తన సోదరుడి భార్య షాక్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం హన్సిక సోదరుడి భార్య, నటి ముస్కాన్ మొత్తం మోత్వాని ఫ్యామిలీపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. పైగా అందులో హన్సిక పేరు కూడా ఉండడం గమనార్హం.
బాలీవుడ్ లో ముస్కాన్ నాన్సీ జేమ్స్ (Muskan Nancy James) ‘మాతా కి చౌకీ’, ‘భారత్ కా వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’, ‘తోడి ఖుషీ తోడి ఘమ్’ సీరియల్స్ తో పాపులర్ అయ్యింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ ఈ అమ్మాయికి 2020 డిసెంబర్లో ప్రపోజ్ చేశాడు. 2021 మార్చిలో ప్రశాంత్, ముస్కాన్ పెద్దల ఆశీర్వాదంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయి ఏడాది కూడా తిరగక ముందే వీరిద్దరి బంధం బీటలు వారింది.
ఇప్పటిదాకా ముస్కాన్ (Muskan Nancy James) సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా పలు పోస్టులు చేస్తూ అత్తమామలపై మండిపడింది. ముస్కాన్ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడంతో డివోర్స్ తీసుకున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక అప్పటి నుంచి ముస్కాన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా అత్తింటి వారిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తూనే ఉంది.
గత రెండు ఏళ్ల నుంచి ఈ జంట విడివిడిగా జీవిస్తున్నట్టు సమాచారం. 2022 డిసెంబర్లో ముస్కాన్ బెల్స్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తన అభిమానులకు తెలియజేసింది. ఈ వ్యాధి వల్ల ముఖ పక్షవాతం వస్తుందట. ఇక ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూ తన తల్లిదండ్రులకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముస్కాన్ తన భర్త ప్రశాంత్ మోత్వానితో పాటు ఆమె కుటుంబంపై షాకింగ్ ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది.
భర్త ప్రశాంత్ మోత్వాని, అత్త జ్యోతి మోత్వాని, వదిన హన్సికపై ఈ మేరకు గృహ హింస చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సెక్షన్ల కింద డిసెంబర్ 18న ముస్కాన్ (Muskan Nancy James) ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ఎఫ్ఐఆర్ ప్రకారం ముస్కాన్ తన అత్త, అలాగే తన భర్త సోదరి అంటే హన్సిక మోత్వాని.. తన జీవితంలో మితిమీరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించింది. దానివల్ల తన భర్తతో రిలేషన్ దెబ్బతిందని ఆమె ఆరోపించింది.
అంతేకాకుండా తన అత్తింటి వారు ఖరీదైన బహుమతులు, డబ్బు కట్నం కింద డిమాండ్ చేస్తున్నారని, పైగా ఆస్తులకు సంబంధించి తనను మోసం చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. వీరి వల్ల తాను గృహహింసను ఎదుర్కొన్నానని, అది తీవ్రమైన ఒత్తిడికి దారి తీసి, బెల్ పాల్సీ రావడానికి కారణమైంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఈ విషయమై మీడియా ఆమెను ప్రశ్నించగా… “అవును ప్రశాంత్, హన్సిక, జ్యోతి లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. న్యాయ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ టైంలో నేనేమీ మాట్లాడలేను” అంటూ కుండబద్దలు కొట్టింది.