Upasana Singh : ప్రముఖ బాలీవుడ్ నటి, కమెడియన్ ఉపాసన సింగ్ (Upasana Singh) తాజాగా ఓ సౌత్ డైరెక్టర్ తనను హోటల్ రూమ్ కి రమ్మన్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సదరు అగ్ర దర్శకుడి వల్ల తాను ఇబ్బంది పడ్డాను అంటూ తాజాగా ఆమె చేసిన కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి.
‘ది కపిల్ శర్మ’ షోతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఈ సెలబ్రిటీ టాక్ షోలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటూ ఉంటారు. అందులో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన సింగ్ (Upasana Singh) మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ, ఆయన కంటే హైట్ ఎక్కువగా ఉన్న కారణంతో ఆ సినిమా నుంచి తొలగించారని చెప్పి షాక్ ఇచ్చింది. ‘మైనే ప్యార్ కియా’ మూవీలో ముందుగా ఉపాసనను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ హైట్ సమస్యతో పక్కన పెట్టారట. ‘మైనే ప్యార్ కియా’ సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ లకు ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చిపెట్టింది.
ఇక ఇంటర్వ్యూలో ఉపాసన (Upasana Singh) మాట్లాడుతూ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మొదట్లో తాను చాలా సమస్యలు ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా దక్షిణానికి చెందిన ఓ అగ్ర దర్శకుడి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డానంటూ ఆరోపణలు చేసింది. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ హీరోగా, తను హీరోయిన్ గా ఓ సినిమా ఫిక్స్ అయిందట అప్పట్లో. ఈ విషయం గురించి ఉపాసన మాట్లాడుతూ “ఈ ప్రాజెక్టుకు హీరోయిన్ గా అగ్రిమెంట్ పై సైన్ చేయడం కూడా పూర్తయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి మీటింగ్ జరిగినా నేను మా అమ్మ, చెల్లిని వెంట తీసుకెళ్లేదాని. దీంతో ఓ రోజు ఆ డైరెక్టర్ ఎందుకు ఇలా ప్రతి మీటింగ్ కి వాళ్ళని వెనకేసుకొస్తున్నావ్? అని ప్రశ్నించాడు. ఓ రోజైతే ఏకంగా రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేసి సిట్టింగ్ కోసం హోటల్ కి రమ్మని అన్నాడు. ఉదయాన్నే ఆఫీస్ కి వచ్చి కథ వింటానని చెప్పాను. దీంతో ఆయన నీకు సిట్టింగ్ అంటే అర్థమేంటో తెలియదా? అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో ఆ తర్వాత రోజు ఉదయాన్నే అతని ఆఫీస్ కి వెళ్లి అక్కడ అందరి ముందే చెడామడా తిట్టి బయటకు వచ్చేసాను.
కానీ తర్వాత ఆ ప్రాజెక్ట్ నా చేయి జారిపోవడంతో ఎంతగానో బాధపడ్డాను. కనీసం వారం రోజులపాటు ఇంటి నుంచి బయట అడుగు పెట్టలేదు. అప్పటికే అనిల్ కపూర్ తో సినిమా చేస్తున్నానని అందరికీ చెప్పాను. కానీ ఇప్పుడు ఏం చెప్పాలో అర్థంకాక అలా ఉండిపోయాను. కానీ ఆ ఏడు రోజుల్లో నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఇండస్ట్రీని మాత్రం వదల వద్దని ఆ టైంలోనే డిసైడ్ అయ్యాను” అని చెప్పింది. కానీ ఆ సౌత్ అగ్ర దర్శకుడు ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఆమె బయట పెట్టలేదు.
ఇక ఉపాసన సింగ్ ఇప్పటిదాకా డర్, లోఫర్, డిస్కో సింగ్, బబ్లీ బౌన్సర్, హల్చల్, హంగామా, బాదల్, భీష్మ వంటి సినిమాల్లో నటించారు.