Urvashi Rautela : రీసెంట్ గా రిలీజ్ అయిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) మూవీతో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ హిట్ అవ్వడం పట్ల ఎక్కువ సంతోషంగా ఉన్న వ్యక్తి అంటే అది కచ్చితంగా ఈ అమ్మడే. ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్లు లేనప్పటికీ, క్రేజ్ మాత్రం భారీగానే ఉంది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే ఈ బ్యూటీ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంది. తాజాగా ఊర్వశి 3 నిమిషాలకి 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందనే వార్త వైరల్ గా మారింది.
నిమిషానికి 1 కోటి వసూలు చేస్తున్న ఊర్వశి
వరుస పరాజయాలు ఉన్నప్పటికీ ఊర్వశీ రౌతేలాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ క్రేజ్ నే క్యాష్ చేసుకుంటోంది ఈ బీటౌన్ బ్యూటీ. ప్రస్తుతం ఊర్వశి రౌతేలాకు ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో 73 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తన కెరీర్ లో వరస డిజాస్టర్లు అందుకున్నప్పటికీ ఈ బ్యూటీ నిమిషానికి కోటి రూపాయలు పారితోషకంగా వసూలు చేస్తుందని టాక్ నడుస్తోంది. తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీలో కేవలం 3 నిమిషాలు నటించేందుకు ఏకంగా 3 కోట్ల పారితోషికాన్ని తన ఖాతాలో వేసుకుందట ఈ అమ్మడు. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. దీంతో డైమండ్ దీదీ క్రేజ్ మామూలుగా లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఊర్వశి రౌతేలాను డైమండ్ దీదీ అని ఎందుకు అంటున్నారంటే… ఇటీవల సైఫ్ పై జరిగిన దాడి గురించి ఆమె చేసిన కామెంట్స్ కారణం. ఇటీవల తన తండ్రి డైమండ్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని, అలాంటివి ఉన్నప్పుడు బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది అంటూ ఊర్వశి కామెంట్స్ చేసింది. దీంతో అక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? ఆమె షో ఆఫ్ చేయడం ఏంటి? అంటూ విమర్శలు విన్పించాయి. అప్పటి నుంచి ఊర్వశిని డైమండ్ దీదీ అని పిలవడం మొదలుపెట్టారు.
ఓటీటీలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’
కాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ‘డాకు మహారాజ్’. ఇందులో బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటించారు. బాబి కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ‘డాకు మహరాజ్’ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 104 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇక ‘డాకు మహారాజ్’ మూవీ ఫిబ్రవరి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ వెర్షన్ నుంచి ఊర్వశి నటించిన సీన్స్ ను తొలగించాలని రూమర్స్ వచ్చాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటిదాకా అటు నెట్ ఫ్లిక్స్, ఇటు చిత్ర బృందం స్పందించలేదు. మరి మూవీలో ఊర్వశి నటించిన సీన్స్ ఉన్నాయా లేదా తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో మూవీని చూడాల్సిందే.