Valentine’s day:- ప్రేమ అనేది ఒకరి జీవితంలో పుట్టినప్పటి నుండి.. చెప్పాలంటే పుట్టకముందు నుండే ఉంటుంది. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత.. టీనేజ్ వయసుకు చేరుకున్న తర్వాత వ్యక్తి జీవితంలోకి వచ్చే ప్రేమ.. అత్యంత అందంగా ఉంటుంది. అలాంటి ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికే వాలెంటైన్స్ డే అనేది ఏర్పాటయ్యిందేమో. అసలు ప్రేమికులు సెలబ్రేట్ చేసుకునే ఈరోజును వాలెంటైన్స్ డే అని ఎందుకు అంటారంటే..
5వ శతాబ్దం ముందువరకు ఫిబ్రవరి 13 నుండి 15 వరకు లూపర్కాలియా అనే పేరుతో ఒక రోమన్ ఫెస్టివల్ జరిగేది. అదే సమయంలో ఒక ఊరిలోని యువతీయువకులు లాటరీ పద్ధతిలో ఎవరిని ప్రేమించాలి అని డిసైడ్ చేసుకునేవారు. అలా ప్రేమించుకున్న కొన్ని జంటలు ఫెస్టివల్ చివరిలో పెళ్లి కూడా చేసుకునేవారు. అలా కొన్నాళ్ల తర్వాత ఆ ఫెస్టివల్ జరుపుకునే పద్ధతి మారిపోయింది. పోప్ గ్యాలసియస్ అనే వ్యక్తి ఈరోజుకే సెయింట్ వాలెంటైన్స్ డే అని పేరుపెట్టారు.
సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి అప్పట్లో రోమన్‌లో ప్రేమించుకున్న జంటలకు రహస్యంగా పెళ్లిళ్లు చేసేవారట. రోమన్ రాజు క్లాడియస్ 2 మగవారు పెళ్లి చేసుకోవడానికి అనుమతిని ఇచ్చేవారు కాదట. అందుకే వాలెంటైన్.. రాజుకు తెలియకుండా జంటలను ఒకటి చేసేవారు. అలా ప్రేమను నమ్మి, ప్రేమికులను కలిపిన వాలెంటైన్ పేరుమీద ఈ వాలెంటైన్స్ డే జరుగుతుంది. సమయం గడుస్తున్నకొద్దీ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకునే వాలెంటైన్స్ డే.. వారం రోజులకు మారింది.
ఈరోజుల్లో ప్రేమకు రకరకాల నిర్వచణాలు వచ్చేశాయి. అందుకే చాలామంది యువతీయువకులకు దాని మీద నమ్మకం పోయింది. దానిని నమ్మిన వారు మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా కలిసి నడవలాని నిర్ణయించుకుంటున్నారు. నడుస్తున్నారు కూడా. ఇద్దరు మనుషులు మరణించిన తర్వాత కూడా.. వారి ప్రేమ అలా ఉండేది.. ఇలా ఉండేది అని మాట్లాడుకునేలా, నలుగురికి ఉదాహరణగా నిలిచే జంటలు కూడా ఉన్నాయి. అలా ముగింపు లేని ఎన్నో ప్రేమజంటలకు, ప్రేమకు ‘హ్యాపీ వాలెంటైన్స్ డే.’