Varun Tej : మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తాజాగా మట్కా (Matka ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితం అలాగే తన చివరి కోరిక ఏంటో కూడా వివరించారు.
దాంపత్య జీవితం బాగుండాలంటే సరైన భాగస్వామి కావాలి..
వరుణ్ తేజ్ ముందుగా పెళ్లి జీవితం గురించి మాట్లాడుతూ.. ” సింగిల్ గా ఉన్నప్పుడు స్నేహితులతో సంతోషంగా గడిపాను. అయితే వారితో అన్ని విషయాలు కూడా పంచుకునేవాడిని. కాకపోతే స్నేహితులు ఎప్పుడూ మనతో ఉండరని కొంత కాలానికి అర్థం అయింది. ఇక మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకోవడానికి ,జీవితంలో మనకంటూ ఒక భాగస్వామి ఉండాలని అప్పుడే తెలుసుకున్నాను. ముఖ్యంగా ఒక బంధం సరిగ్గా , బలంగా ఉండాలి అంటే సరైన వ్యక్తిని ఎంచుకోవడం లోనే ఉంటుంది. అలా కాని పక్షంలో అది నరకమే అవుతుంది. లావణ్య తో ఏడేళ్లు రిలేషన్ లో ఉన్నాను. ఒకరికొకరు సరిపోతామని తెలుసుకున్న తర్వాతనే, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని , ఆ తర్వాత పెద్దలకు మా ప్రేమ గురించి చెప్పాము. వారిని ఒప్పించి వివాహం చేసుకున్నాము” అంటూ వరుణ్ తేజ్ పెళ్లి జీవితం గురించి తెలిపారు.
అదే నా చివరి కోరిక..
ఇక పెళ్లి జీవితం చక్కగా ఉంటే.. మన కలలు సాకారం చేసుకోవడంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టవచ్చు అంటూ కూడా వరుణ్ తెలిపారు. అలాగే కెరియర్ గురించి మాట్లాడుతూ.. ” సినీ వాతావరణం ఉన్న కుటుంబంలో పుట్టడం వల్లే చిన్నతనం నుంచి నాకు సినిమాల పైన ఇష్టం పెరిగింది. సినీ పరిశ్రమలోనే ఏదో ఒక విభాగంలో సెటిల్ అవ్వాలని అనుకున్నాను. అయితే ముందుగా దర్శకత్వం చేయాలనేది నా మొదటి ఆలోచన. దానికి నాన్నకు చెప్పాను. నాన్న (నాగబాబు) కూడా నన్ను దర్శకుడిని చేయడం కోసం ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దగ్గరికి పంపించారు. ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి ముందు నాకు దర్శకత్వంపై ఎలాంటి అవగాహన లేదు. దాదాపు రెండు రోజులపాటు ఆయనతో మాట్లాడాను. ఇక ఆ మాటలు విన్న తర్వాత డైరెక్షన్ విభాగం అనేది అంత సులభమైన పని కాదు అని అర్థమైంది. ఆ తర్వాత నేను మళ్లీ ఆయనను కలవలేదు. కొంతకాలానికి నటన వైపు అడుగులు వేసి ఇప్పుడు మట్కా సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. కానీ భవిష్యత్తులో అవకాశం వస్తే కచ్చితంగా దర్శకత్వం చేస్తాను .అది నా చివరి కోరిక” అంటూ తెలిపారు వరుణ్ తేజ్.
మట్కా మూవీ..
హీరోగా ఇప్పుడిప్పుడే మెప్పించే ప్రయత్నం చేస్తున్న ఈయన.. దర్శకుడిగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో అంటూ అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మట్కా సినిమా విషయానికొస్తే కరుణకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది గ్యాంబ్లర్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తో వరుణ్ సక్సెస్ అందుకోవాలని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.